
క్షేత్రస్థాయి పరిశీలనలతో వార్డుల అభివృద్ధి: సైబరాబాద్ కమిషనర్ జి. సృజన
ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతిరోజూ ఒక వార్డును సందర్శించే ‘వన్ వార్డ్ ఎవ్రీ డే’ వినూత్న కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన క్షేత్రస్థాయిలో పర్యటించారు. కుత్బుల్లాపూర్ జోన్, మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పుదూర్-కిష్టాపూర్ వార్డులో డిప్యూటీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులు, ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ సభ్యులతో కమిషనర్ నేరుగా మాట్లాడి, స్థానిక సమస్యలను తెలుసుకుని, మౌలిక సదుపాయాలను సమీక్షించారు.
ఈ పరస్పర చర్చా కార్యక్రమంలో పౌరులు రోడ్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, చెరువుల రక్షణ, ప్రజా వసతులకు సంబంధించిన పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పుదూర్ గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు ఆర్‌అండ్ బీ రోడ్లను వెడల్పు చేసి, అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు. అన్ని నివాస ప్రాంతాలకు అంతరాయం లేకుండా తగినంత తాగునీరు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం అదనపు ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించాలని, జలవనరుల కాలుష్యాన్ని నివారించడానికి గుర్తించిన ప్రాంతాలలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ను ఏర్పాటు చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎర్రంచెరువు, మొతులకుంట చెరువుల కట్టలను బలోపేతం చేసి, అభివృద్ధి చేయాలని నివాసితులు కోరారు. ప్రజల రక్షణ, సౌకర్యం కోసం వీధిదీపాలు లేని ప్రాంతాలలో అదనంగా స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలని కోరారు.
కమిషనర్ స్పందిస్తూ.. ఈ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రాధాన్యత ఆధారంగా దశలవారీగా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పౌరుల ప్రత్యక్ష భాగస్వామ్యంతో వార్డుల వారీగా జీవన ప్రమాణాలను, మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
