Let's talk: editor@tmv.in
ఆధునిక సాంకేతికతతో మారిపోయిన యుద్ధ వ్యూహాలు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఆధునిక సాంకేతికతతో మారిపోయిన యుద్ధ వ్యూహాలు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఆధునిక సాంకేతికతతో మారిపోయిన యుద్ధ వ్యూహాలు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఆధునిక సాంకేతికతతో మారిపోయిన యుద్ధ వ్యూహాలు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఆధునిక సాంకేతికతతో మారిపోయిన యుద్ధ వ్యూహాలు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Gaddamidi Naveen
14 జూన్, 2026

ఆధునిక ప్రపంచంలో సరికొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతికతలు యుద్ధాల స్వరూపాన్నే పూర్తిగా మార్చివేశాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సాయుధ దళాల్లోకి కొత్తగా చేరే యువ అధికారులు భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి యుద్ధ తంత్రానికైనా మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఐఏఎఫ్ అకాడమీలో జరిగిన 217వ కోర్సు సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ)కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు.

యుద్ధ రంగంలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని మంత్రి పేర్కొన్నారు. ఒకప్పుడు కేవలం అగ్రరాజ్యాలకే యుద్ధరంగంలో తిరుగులేని ఆధిక్యం ఉండేదని.. కానీ నేటి తరుణంలో చిన్న దేశాలు సైతం తమ ప్రత్యేకమైన చిన్న ఆయుధాలు, వినూత్న వ్యూహాలతో పెద్ద శక్తులకు భారీ నష్టాన్ని కలిగించగలుగుతున్నాయని వివరించారు. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త అధికారులు ఆధునిక యుద్ధ వ్యూహాలను అర్థం చేసుకుంటూ, అవసరమైతే వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు.

ఆధునిక యుద్ధ రంగంలో సాంకేతికత పాత్ర

గతంలో లాగా సైనికులు, భారీ ఆయుధాలు నేరుగా కంటికి కనిపించే రోజులు పోయాయని, నేటి తరం యుద్ధాల్లో తెరవెనుక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆధునిక యుద్ధాలలో రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్లు, సెన్సార్లు, రోబోటిక్స్ వంటి అధునాతన సాంకేతిక వ్యవస్థలు ముందు వరుసలో ఉంటున్నాయి. ప్రత్యర్థి దేశాల ట్రాఫిక్ సిస్టమ్స్, సీసీటీవీ నెట్‌వర్క్‌లను సైతం రిమోట్ ద్వారా నియంత్రించే సరికొత్త సైబర్ యుద్ధ పరిస్థితులను మనం ఇప్పుడు కళ్లారా చూస్తున్నామని ఆయన వివరించారు. కష్టపడి పనిచేయడంతో పాటు స్మార్ట్ వర్క్ చేయడం కూడా అంతే ముఖ్యమని.. నేడు సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ దేశాలు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని ఆయన గుర్తుచేశారు.

శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న క్రెడెట్లను అభినందిస్తూ.. ఐఏఎఫ్ యొక్క చారిత్రాత్మక ప్రస్థానాన్ని ఆయన గుర్తుచేశారు. 1947-48లో శ్రీనగర్ ఎయిర్‌లిఫ్ట్ ద్వారా కాశ్మీర్ యుద్ధ గమనాన్ని మార్చడమే కాకుండా, 1971లో ఢాకాపై నిర్ణయాత్మక వైమానిక దాడులు చేసి కేవలం 13 రోజుల్లోనే వాయుసేన చరిత్ర సృష్టించిందన్నారు. భారత దేశానికి వాయుసేన ఎల్లప్పుడూ రక్షణాత్మక కవచం గానూ, దాడి చేసే ఖడ్గంగానూ నిలిచిందని కొనియాడారు. గతంలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ లో వాయుసేన ఎంతో ఖచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిందని, ఇది కేవలం స్వదేశీ సాంకేతికత వల్లే కాకుండా ధైర్యసాహసాలు కలిగిన అధికారుల శిక్షణ వల్ల సాధ్యమైందని చెప్పారు.

మహిళా పైలట్లు, ఐఏఎఫ్ ఘనత

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని, ఇటీవల అంతరిక్ష ప్రయాణానికి ఎంపికైన శుభాంశు శుక్లా ఉదాహరణగా చూపిస్తూ, ఆ గొప్ప వారసత్వాన్ని అధికారులు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఐఏఎఫ్‌లో మహిళా పైలట్ల సంఖ్య నిరంతరం పెరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మహిళల భాగస్వామ్యంతో వాయుసేన మరింత శక్తిమంతంగా, సంపూర్ణ సమతుల్యతతో రూపాంతరం చెందుతోందన్నారు. కేవలం దేశ సరిహద్దులను కాపాడటమే కాకుండా, అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లో విదేశీ పౌరులను సురక్షితంగా రక్షించడంలో ఐఏఎఫ్ చూపిన మానవతా దృక్పథం భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడారు.

ఈ అద్భుతమైన వేడుకలో ఫ్లైట్ క్యాడెట్లకు రక్షణ మంత్రి చేతుల మీదుగా ‘ప్రెసిడెంట్స్ కమిషన్’ హోదాను ప్రదానం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశానికి చెందిన ట్రైనీ అధికారులకు ఆయన ‘వింగ్స్’, ‘బ్రెవెట్స్’ అందజేశారు. వివిధ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన ప్రతిభావంతులకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ప్రెసిడెంట్స్ ప్లాక్’ పురస్కారాలను అందజేసి అభినందించారు.