Let's talk: editor@tmv.in
విశాఖ స్టీల్‌‌ప్లాంట్ బాధితులకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం: కేంద్ర మంత్రి కుమారస్వామి
విశాఖ స్టీల్‌‌ప్లాంట్ బాధితులకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం: కేంద్ర మంత్రి కుమారస్వామి

విశాఖ స్టీల్‌‌ప్లాంట్ బాధితులకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం: కేంద్ర మంత్రి కుమారస్వామి

Gaddamidi Naveen
10 జూన్, 2026

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ‘శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం’ పిల్లలకు ఉచిత విద్యను అందించనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి వెల్లడించారు.

సోమవారం సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ‘స్టీల్ మెల్ట్ షాప్-1’ విభాగంలో ద్రవరూప ఉక్కును తరలించే కాస్టింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు కారణంగా ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన తీరుపై ఆర్‌ఐఎన్‌ఎల్ ఉన్నతాధికారులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాద స్థలాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితలతో కలిసి పరిశీలించిన కుమారస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగ అవకాశాలు చట్టపరమైన బీమా, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలకు అదనంగా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలు వారు పదవీ విరమణ పొందే వరకు ఉక్కు నగరంలోని క్వార్టర్లలో కొనసాగవచ్చని తెలిపారు. ప్రస్తుతం టౌన్‌షిప్ వెలుపల నివసిస్తున్న కుటుంబాలకు కూడా అర్హత మేరకు క్వార్టర్లు కేటాయిస్తామని చెప్పారు.

అలాగే మృతుల పిల్లలు ఆర్‌ఐఎన్‌ఎల్ ఉద్యోగుల పిల్లలతో సమానంగా విద్యా సదుపాయాలను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. గాయపడిన కార్మికుల వైద్య చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ఆర్‌ఐఎన్‌ఎల్ భరిస్తుందని, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిశ్రమ పునరుద్ధరణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని కుమారస్వామి హామీ ఇచ్చారు.

పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి సాయం, నిపుణుల కమిటీ ఏర్పాటు

ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. ప్రధాని జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 అదనపు సాయాన్ని కుమారస్వామి ప్రకటించారు. కార్మికులెవరూ ఆందోళన చెందవద్దని, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ, అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

ఈ ఘోర ప్రమాదానికి గల అసలు కారణాలను అన్వేషించడానికి ఇతర ప్రముఖ స్టీల్ ప్లాంట్ల నిపుణులతో కూడిన ఒక "ప్రత్యేక విచారణ కమిటీ"ని ఏర్పాటు చేసినట్లు మంత్రి ప్రకటించారు. ఈ కమిటీ మంగళవారం విశాఖకు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ ఒక సమగ్ర నివేదికను అందిస్తుందని కేంద్రమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు.