

భద్రతా ప్రమాణాల నిర్లక్ష్యం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం: వైఎస్ జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జూన్ 8న జరిగిన ఘోర పేలుడు ప్రమాదానికి ప్రస్తుత టీడీపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఆరోపించారు. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు, సరైన నిర్వహణ, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగి తొమ్మిది మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలను, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను జగన్ పరామర్శించి, వారిని ఓదార్చారు. అనంతరం ఓడరేవు నగరమైన విశాఖలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ ఘోర విపత్తుపై స్పందించడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మానవత్వం, కరుణ లోపించాయని మండిపడ్డారు. బాధితులకు తక్షణమే పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గత రెండు సంవత్సరాలలోనే స్టీల్ ప్లాంట్ సుమారు 10,500 మంది ఉద్యోగులు తగ్గిపోయారని జగన్ గుర్తుచేశారు. ఇందులో 6,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు, వీఆర్ఎస్ ద్వారా బయటకు వెళ్లిన 1,800 మంది సాధారణ పదవీ విరమణ పొందిన 2,500 మంది ఉన్నారన్నారు. దీనివల్ల ప్లాంట్‌లో ఉద్యోగుల సంఖ్య ఒకప్పుడు 28,000 ఉండగా, ఇప్పుడు కేవలం 16,000కు పడిపోయిందని.. ఫలితంగా మిగిలిన సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని, 2019-2024 మధ్య కాలంలోని తమ వైఎస్సార్‌సీపీ పాలనకు, ఇప్పటి ప్రభుత్వ పాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనించాలని జగన్ కోరారు. కార్మికులకు నాలుగు నెలలకు పైగా జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారని, చరిత్రలో మొదటిసారిగా జీతాలను ఉత్పత్తి లక్ష్యాలతో ముడిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా కార్మికులకు బోనస్‌లు, వైద్య సదుపాయాలు, హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీసీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లు ఇతర ప్రోత్సాహకాలను నిలిపివేశారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో స్టాఫ్ క్వార్టర్స్‌లో యూనిట్ విద్యుత్ ధర కేవలం 50 పైసలు ఉంటే, ఈ ప్రభుత్వం దానిని ఏకంగా రూ. 8.5 కు పెంచిందని.. కార్మికులు క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్లేలా ఒత్తిడి చేయడానికే ఈ దారుణానికి ఒడిగట్టారని విమర్శించారు.
నిధుల దుర్వినియోగం
స్టీల్ ప్లాంట్ కోసం ప్రకటించిన రూ. 11,440 కోట్ల ప్యాకేజీ నిధులు ఏమయ్యాయని జగన్ ప్రశ్నించారు. ఆ నిధులను ప్లాంట్ నిర్వహణ, భద్రతా ప్రమాణాల మెరుగుదల లేదా కార్మికుల సంక్షేమం కోసం వాడకుండా కేవలం వీఆర్ఎస్ అమలుకు, జీఎస్టీ బకాయిలకు, పాత అప్పులు తీర్చడానికే దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ ప్రమాదానికి కార్మికులు ఎంతమాత్రం బాధ్యులు కారని జగన్ స్పష్టం చేశారు. ముడిసరుకు మిశ్రమంలో లోపాలు, నాణ్యత లేని మెటీరియల్ వాడకం లేదా కార్యాచరణ లోపాల వల్లే ద్రవరూప ఉక్కును బదిలీ చేస్తున్నప్పుడు పేలుడు సంభవించి ఉండవచ్చన్నారు. రవాణా బకెట్ల నుంచి ద్రవ ఉక్కు ఒక్కసారిగా పొంగిపొర్లి కార్మికులపై పడటం వల్లే ఈ ఘోర మరణాలు సంభవించాయని వివరించారు.
తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిందని, ఏ పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయవద్దని తాము 2021 మార్చి 9న ప్రధాని మోడీకి లేఖ కూడా రాశామని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు హక్కుగా రావాల్సిన రూ.1.72 కోట్లకి అదనంగా కూటమి ప్రభుత్వం మరో రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ డబ్బు ఇవ్వకపోతే.. 2029లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బాధితులకు న్యాయం చేయాలని, ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను వెంటనే పెంచి కార్మికులకు మెరుగైన వసతులు కల్పించాలని జగన్ డిమాండ్ చేశారు.
