
దేశానికే గ్రోత్ ఇంజిన్‌గా విశాఖ గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ :ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో ప్రముఖ డిజిటల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం విశాఖపట్నం సమీపంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పడుతున్న ఈ ప్రాజెక్ట్ దేశ అభివృద్ధికి వృద్ధి యంత్రంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏప్రిల్ 28, 2026 ఆంధ్రప్రదేశ్, భారత చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుందని ఆసియాలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌గా అవతరించనున్న ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు గర్వకారణమని తెలిపారు. ఇది సాధారణ శంకుస్థాపన కాదని రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తుకు పునాది అని వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సేవలను వినియోగిస్తుండగా అదే సంస్థ ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకోవడం రాష్ట్ర ప్రత్యేకతను ప్రతిబింబిస్తుందని సీఎం పేర్కొన్నారు. 2025 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ను 2028 సెప్టెంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. నిర్ణయించిన గడువుకంటే ముందుగానే పనులు పూర్తి చేయాలని భాగస్వామ్య సంస్థలకు సూచించారు.
ఈ డేటా సెంటర్ ద్వారా రాష్ట్ర యువతకు వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వలసలకు ప్రతీకగా నిలిచిన ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ ప్రాజెక్ట్‌తో అభివృద్ధి కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.
గూగుల్ సాంకేతికత ఆధారంగా రాష్ట్రంలో అత్యాధునిక ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని త్వరలో ప్రతి పౌరుడికి ఏఐ డాక్టర్, ఏఐ వ్యక్తిగత సహాయకుడు వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తాను కూడా త్వరలో ఏఐ అసిస్టెంట్‌ను వినియోగించనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ 600 ఎకరాల్లో తార్లువాడ, ఆదివివరం, రాంబిల్లి ప్రాంతాల్లో ఏర్పాటు కానుంది.1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ డేటా సెంటర్ దేశ డిజిటల్ మౌలిక వసతుల విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్రాన్ని 6.5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం దీర్ఘకాలిక లక్ష్యంగా నిర్ణయించింది.
రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తూర్పు-పడమర కనెక్టివిటీ బలోపేతం అవసరమని కేంద్రాన్ని కోరారు. గోదావరి నదీ జలాలను 60 రోజుల్లో విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు మళ్లించనున్నట్లు హామీ ఇచ్చారు.
గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో నిర్మాణం పూర్తిచేసిన భోగాపురం విమానాశ్రయాన్ని జూలైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని సీఎం వెల్లడించారు.
విశాఖపట్నం అంతర్జాతీయ ఏఐ హబ్: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ భారీ ప్రాజెక్టుతో విశాఖపట్నం ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా ఆవిర్భవిస్తుందని ప్రశంసించారు. అదానీ కనెక్స్ ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడుతున్న ఈ 1 గిగావాట్ హై పర్‌స్కేల్ డేటా సెంటర్, భారత ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ సర్వర్లు, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) చిప్‌లను కూడా దేశంలోనే తయారు చేసే దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
రైల్వే, లాజిస్టిక్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు
రైల్వే లాజిస్టిక్స్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న అభివృద్ధిపై అశ్విని వైష్ణవ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ. 10,100 కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయించామని ప్రస్తుతం ఏపీలో రూ. 1.06 లక్షల కోట్ల విలువైన రైల్వే పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అయిన దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జూన్ 1 నుండి అధికారికంగా అమల్లోకి రానుందని ఆయన ప్రకటించారు.
హై-స్పీడ్ డైమండ్ కనెక్టివిటీ
దక్షిణ భారతంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ' హై-స్పీడ్ డైమండ్' బుల్లెట్ ట్రైన్ నెట్‌వర్క్‌ను యోచిస్తోందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్-అమరావతి మధ్య ప్రయాణ సమయం కేవలం 70 నిమిషాలకు, అమరావతి-చెన్నై మధ్య 112 నిమిషాలకు మరియు చెన్నై-బెంగళూరు మధ్య 73 నిమిషాలకు తగ్గుతుందని ఆయన వివరించారు. ఈ మౌలిక సదుపాయాల విస్తరణతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ మరియు టెక్నాలజీ హబ్‌గా మారుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
.
