Let's talk: editor@tmv.in
విరుదునగర్ పేలుడు ఘటన.. 25కు చేరిన మృతుల సంఖ్య
విరుదునగర్ పేలుడు ఘటన.. 25కు చేరిన మృతుల సంఖ్య
విరుదునగర్ పేలుడు ఘటన.. 25కు చేరిన మృతుల సంఖ్య

విరుదునగర్ పేలుడు ఘటన.. 25కు చేరిన మృతుల సంఖ్య

Shaik Mohammad Shaffee
21 ఏప్రిల్, 2026

తమిళనాడులోని బాణసంచా తయారీ కేంద్రంగా పేరొందిన విరుదునగర్ జిల్లాలో ఆదివారం సంభవించిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. కట్టనార్‌పట్టి సమీపంలోని వనజ ఫైర్‌వర్క్స్ యూనిట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య సోమవారానికి 25కు చేరుకుంది. మృతుల్లో 22 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో, మృతుల శరీరాలపై ఉన్న నగలను బట్టి వారిని గుర్తించాల్సి వస్తోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కార్మికులు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

రెండోసారి పేలుడు.. సహాయక సిబ్బందికి గాయాలు

ఈ ఘటనలో సహాయక చర్యల సమయంలో ఊహించని మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం జేసీబీతో శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా రెండోసారి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు, ఒక రెవెన్యూ అధికారితో సహా మొత్తం 12 మంది గాయపడ్డారు. పేలని బాణసంచా సామాగ్రి శిథిలాల కింద ఉండటంతో సహాయక చర్యలకు గంటల తరబడి ఆటంకం ఏర్పడింది. ఒకవైపు మంటలు, మరోవైపు వరుస పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయి యుద్ధభూమిని తలపించింది.

నిబంధనలు బేఖాతరు

సాధారణంగా బాణసంచా యూనిట్లకు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ, యజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా 100 మందికి పైగా కార్మికులతో పనులు చేయించడం ఈ అనర్థానికి దారితీసింది. రసాయనాల మిక్సింగ్ షెడ్డులో కేవలం నలుగురికి మాత్రమే అనుమతి ఉండగా, ప్రమాద సమయంలో అక్కడ ఏకంగా 40 మంది ఉన్నట్లు కలెక్టర్ జయశీలన్ ప్రాథమిక విచారణలో తేల్చారు. భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఇంతటి భారీ ప్రాణనష్టం సంభవించిందని అధికారులు ధ్రువీకరించారు.

ముగిసిన పోస్టుమార్టం!

ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతోంది. అయితే శరీరాలు పూర్తిగా కాలిపోయి ఉండటంతో గుర్తింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇప్పటివరకు 19 మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి పరిసరాలు మిన్నంటాయి. మృతుల్లో అధిక శాతం మంది సీర్వైకారంపట్టి గ్రామానికి చెందిన వారని స్థానికులు చెబుతున్నారు.

కన్నీరుమున్నీరైన కుటుంబాలు

ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని చీకట్లు నింపింది. 25 ఏళ్లుగా ఇదే కేంద్రంలో పనిచేస్తున్న ఇంద్రాణి (46) అనే మహిళ ఈ దుర్ఘటనలో మరణించింది. ఆమె కుమార్తె మధుబాల తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. "నాన్న వికలాంగుడు, ఇంట్లోనే ఉంటారు. అమ్మే మా కుటుంబానికి ఆధారం. నేను ఎంఎస్సీ చదివినా పెట్రోల్ బంకులో పనిచేస్తూ తమ్ముడి చదువుకు సాయం చేస్తున్నాను. ఇప్పుడు అమ్మ లేకపోవడంతో మా భవిష్యత్తు అంధకారమైంది" అని కన్నీరుమున్నీరైంది.

పరిహారం కోసం ఆందోళన.. నిలిచిన ట్రాఫిక్

ప్రభుత్వం ప్రకటించే సహాయంపై బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందించాలని, ఫ్యాక్టరీ యజమాని ముత్తుమాణికంను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 1000 మంది బాధితులు, గ్రామస్థులు రోడ్డు రోకో చేపట్టారు. యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకునేది లేదని వారు భీష్మించుకుని కూర్చున్నారు.

రాజకీయ ప్రముఖుల పరామర్శ

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. డీఎంకే ఎంపీ కళానిధి వీరాస్వామి కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

వరుస ప్రమాదాలతో వణుకుతున్న జిల్లా

విరుదునగర్ జిల్లాలో బాణసంచా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే వెంబకోట్టైలో జరిగిన పేలుడులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరువకముందే ఇప్పుడు 25 మంది బలికావడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పేసో లైసెన్స్ ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భద్రతా తనిఖీలు లోపించడమే ఈ మరణాలకు కారణమని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

విరుదునగర్ పేలుడు ఘటన.. 25కు చేరిన మృతుల సంఖ్య - Tholi Paluku