
మళ్లీ రెజ్లింగ్ బరిలోకి వినేష్ ఫొగాట్
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మే 10 నుంచి 12 వరకు ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొనడం ఖరారైంది. అయితే ఈ టోర్నీ రిజిస్ట్రేషన్ విషయంలో గత రెండు రోజులుగా చోటుచేసుకున్న హైడ్రామాకు మంగళవారం తెరపడింది. తన రిజిస్ట్రేషన్‌ను అడ్డుకుంటున్నారని వినేష్ ఆరోపించగా, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాత్రం అవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసింది.
రిజిస్ట్రేషన్ పూర్తి.. వినేష్ భావోద్వేగ ట్వీట్
పారిస్ ఒలింపిక్స్‌లో ఎదురైన చేదు అనుభవం తర్వాత వినేష్ ఫొగాట్ బరిలోకి దిగుతున్న తొలి టోర్నీ ఇదే కావడం విశేషం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "సోమవారం రిజిస్ట్రేషన్ లింక్ పనిచేయకపోవడంతో కాస్త ఆందోళన కలిగింది, కానీ మంగళవారం ఉదయం ప్రక్రియ పూర్తయింది. 20 నెలల విరామం తర్వాత మళ్లీ పోటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు" అని వినేష్ పేర్కొన్నారు. ఆమె గొండా టోర్నీలో 57 కిలోల విభాగంలో పోటీ పడనున్నారు.
రాద్ధాంతం అనవసరం: డబ్ల్యూఎఫ్ఐ
వినేష్ ఫోగట్ ఆరోపణలపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తీవ్రంగా స్పందించింది. రిజిస్ట్రేషన్ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని మండిపడింది. సాంకేతిక కారణాల వల్ల వెబ్‌సైట్ మొరాయించి ఉండవచ్చని, అది కేవలం వినేష్ ఒక్కరికే కాకుండా చాలా మంది రెజ్లర్లకు ఎదురైన సమస్య అని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే ఆందోళన చెందడం ఎందుకని ప్రశ్నించింది. ఒకవేళ ఆన్‌లైన్‌లో సమస్య ఉంటే, నేరుగా సమాఖ్య కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటికే చాలా మంది రెజ్లర్లు ఆ పని చేశారని డబ్ల్యూఎఫ్ఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
రాత్రికి రాత్రే ప్రక్రియ పూర్తి
వినేష్ మంగళవారం ఉదయం తన రిజిస్ట్రేషన్ పూర్తయిందని చెప్పగా, సమాఖ్య వర్గాలు మాత్రం మరోలా చెబుతున్నాయి. ఆమె ఎంట్రీ ప్రక్రియ సోమవారం రాత్రి 10:29 గంటలకే పూర్తయిందని వెల్లడించాయి. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి అథ్లెట్‌కు అవకాశం కల్పిస్తున్నామని సమాఖ్య స్పష్టం చేసింది. ఈ వివాదంపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. క్రీడాకారులు కేవలం తమ ప్రదర్శనపైనే దృష్టి పెట్టేలా చూడడమే తమ ప్రాధాన్యతని తెలిపారు. సాంకేతిక సమస్యలు దృష్టికి రాగానే వెంటనే పరిష్కరించామని, భారత రెజ్లింగ్‌ను ప్రపంచ వేదికపై ఉన్నత స్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కొత్త ఇన్నింగ్స్.. సరికొత్త లక్ష్యాలు
పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన సమయంలో వినేష్ తీవ్ర మనస్తాపానికి గురై రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ కుస్తీ పట్టేందుకు సిద్ధమయ్యారు. మధ్యలో ఆమె తల్లిగా ప్రమోషన్ పొందడంతో పాటు, రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉంటూనే, అటు క్రీడాకారిణిగా ఆసియా క్రీడలు, 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ఆమె సాధన మొదలుపెట్టారు.
