

బ్యాడ్మింటన్‌కు విక్టర్ అక్సెల్సన్ గుడ్‌బై
ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న డెన్మార్క్ షట్లర్ విక్టర్ అక్సెల్సన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు పలికారు. బుధవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. గాయాలతో సతమతమవుతున్న తన శరీరం ఇక ఆపమని చెబుతోందని భావోద్వేగానికి లోనయ్యారు. 32 ఏళ్ల ఈ దిగ్గజం, వెన్నునొప్పి సమస్య కారణంగా గత ఏడాది అక్టోబర్ నుంచి ఆటకు దూరంగా ఉంటున్నారు. శస్త్రచికిత్స జరిగినప్పటికీ నొప్ప తగ్గకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
గాయాలతో సుదీర్ఘ పోరాటం
గత ఏడాది ఏప్రిల్‌లో వెన్నుముకకు శస్త్రచికిత్స చేయించుకున్న అక్సెల్సన్, సుదీర్ఘ పునరావాసం తర్వాత అక్టోబర్‌లో పునరాగమనం చేశారు. అయితే అక్టోబర్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ తర్వాత ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. "శస్త్రచికిత్స తర్వాత కూడా నొప్పి తగ్గలేదు. ఉన్నత స్థాయిలో ఆడటానికి, కనీసం ప్రాక్టీస్ చేయడానికి కూడా నా శరీరం సహకరించడం లేదు. ఒకవేళ మొండిగా ఆడితే మరో సర్జరీ అవసరమని, అది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరించారు. అందుకే నా శరీరం చెబుతున్న మాట విని ఆటకు స్వస్తి పలుకుతున్నా" అని అక్సెల్సన్ పేర్కొన్నారు.
రికార్డుల రారాజు
అక్సెల్సన్ తన కెరీర్‌లో అద్భుతమైన రికార్డులను నెలకొల్పారు. వరుసగా టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించడమే కాకుండా 2017, 2022లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. మూడు సార్లు యూరోపియన్ ఛాంపియన్‌గా, డెన్మార్క్ తరఫున ఆరు సార్లు యూరోపియన్ టీమ్ గోల్డ్ మెడల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఏకంగా 183 వారాల పాటు కొనసాగి, బ్యాడ్మింటన్ చరిత్రలో మూడవ సుదీర్ఘ కాలం అగ్రస్థానంలో ఉన్న ఆటగాడిగా రికార్డు సృష్టించారు.
సంతృప్తిగా నిష్క్రమిస్తున్నా..
ఆస్తమా వంటి సమస్యలు ఉన్నప్పటికీ కెరీర్ పొడవునా పట్టుదలతో ఆడిన అక్సెల్సన్, తన రిటైర్మెంట్ నిర్ణయం బాధాకరమైనప్పటికీ తన ప్రయాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. "ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా, కొన్నిసార్లు అన్యాయంగా అనిపించింది. కానీ ఇన్నేళ్ల పాటు నా శరీరం నాకు అద్భుతంగా సహకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడం, అతిపెద్ద టోర్నీలు గెలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్‌ను ఎంతో గర్వంగా, సంతోషంగా గుర్తు చేసుకుంటాను" అని అక్సెల్సన్ పేర్కొన్నారు.
