Let's talk: editor@tmv.in
టికెట్‌ తనిఖీల్లో విజయవాడ డివిజన్‌ సరికొత్త రికార్డు

టికెట్‌ తనిఖీల్లో విజయవాడ డివిజన్‌ సరికొత్త రికార్డు

Panthagani Anusha
25 ఏప్రిల్, 2026

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్ టికెట్‌ తనిఖీల విభాగంలో అరుదైన మైలురాయిని అధిగమించింది. ఏప్రిల్ నెలలో కేవలం 22 రోజుల్లోనే రూ.10 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించి డివిజన్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. సాధారణంగా నెలవారీగా సాధించే లక్ష్యాలను నెల ముగియడానికి మరో వారం రోజులు మిగిలి ఉండగానే చేరుకోవడం విశేషం. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు గురువారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.

గతంలో 2025 అక్టోబర్‌ నెలలో నమోదైన రూ.8.5 కోట్లే ఇప్పటివరకు అత్యధిక నెలవారీ ఆదాయంగా ఉండేది. ప్రస్తుత వసూళ్లు ఆ రికార్డును భారీ వ్యత్యాసంతో అధిగమించాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మరే ఇతర డివిజన్‌ కూడా ఒక నెలలో ఈ స్థాయి ఆదాయాన్ని సాధించలేదని అధికారులు పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను విజయవాడ డివిజన్ మొత్తం టికెట్‌ తనిఖీ ఆదాయం రూ.76 కోట్లకు పైగా నమోదు కావడం గమనార్హం.

తనిఖీల ముమ్మరం.. ఉల్లంఘనులపై కొరడా

రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయాణించడం, జనరల్‌ టికెట్‌తో రిజర్వేషన్‌ బోగీల్లోకి రావడం (అనియమిత ప్రయాణం) పరిమితికి మించి లగేజీని బుక్ చేయకుండా తరలించడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కాలంలో ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు రద్దీగా ఉండే మార్గాల్లోనూ ఆకస్మిక తనిఖీలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడం వల్ల ఈ భారీ ఆదాయం సమకూరింది. టికెట్‌ తనిఖీ సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో కఠినంగా వ్యవహరించడం వల్లే ప్రయాణికుల్లో క్రమశిక్షణ పెరుగుతోందని రైల్వే వర్గాలు తెలిపాయి.

అగ్రపథాన విజయవాడ

దేశవ్యాప్తంగా ఇండియన్ రైల్వేస్‌లో కీలక జంక్షన్లలో ఒకటిగా ఉన్న విజయవాడ తాజా ఫలితాలతో తన ప్రాముఖ్యతను మరింత చాటుకుంది. టికెట్‌ లేకుండా ప్రయాణించే వారి సంఖ్యను కనిష్ఠ స్థాయికి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ రికార్డు ఆదాయం కేవలం జరిమానాల వసూలే కాకుండా నిబంధనల అమలుపై మా నిబద్ధతకు నిదర్శనం అని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని ప్రయాణికులు తప్పనిసరిగా సరైన టికెట్‌తోనే ప్రయాణించాలని వారు కోరారు.