Let's talk: editor@tmv.in
19, 20 తేదీల్లో శ్రీలంకలో భారత ఉపరాష్ట్రపతి పర్యటన

19, 20 తేదీల్లో శ్రీలంకలో భారత ఉపరాష్ట్రపతి పర్యటన

Shaik Mohammad Shaffee
18 ఏప్రిల్, 2026

భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీలంకలో పర్యటించనున్నారు. భారత ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన శ్రీలంకలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానంలో భాగంగా శ్రీలంకకు భారత్ ఇస్తున్న ప్రాముఖ్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోంది.

అగ్రనేతలతో ద్వైపాక్షిక చర్చలు

రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిశానాయకేతో భేటీ అవుతారు. అనంతరం ప్రధాని డాక్టర్ హరిణి అమరసూర్యతో కలిసి వివిధ ద్వైపాక్షిక అంశాలపై సమగ్ర చర్చలు జరుపుతారు. ఇటీవలి కాలంలో భారత్, శ్రీలంకల మధ్య పెరిగిన ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలను ఈ పర్యటన మరింత పటిష్టం చేయనుంది. పర్యటనలో భాగంగా ఆయన శ్రీలంకలోని భారత ప్రవాస ప్రతినిధులతో పాటు ఇతర రాజకీయ, సామాజిక నాయకులతోనూ సమావేశం కానున్నారు.

పు నరావాస కార్యక్రమాలకు భారత్ చేయూత

ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. ముఖ్యంగా ‘దిత్వా’ తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పునరావాస పనులు, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భారత ప్రభుత్వం తన మద్దతును ప్రకటించనుంది. భారత ప్రభుత్వ ఆర్థిక, సాంకేతిక సహకారంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులు శ్రీలంక అభివృద్ధిలో కీలకం కానున్నాయి. ఉపరాష్ట్రపతి వెంట భారత్ నుంచి వెళ్లే ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ ఒప్పందాల ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.

వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత ప్రభుత్వ ‘విజన్ మహాసాగర్’ వ్యూహంలో శ్రీలంకను ఒక కీలక భాగస్వామిగా భారత్ పరిగణిస్తోంది. వేల ఏళ్ల నాటి చారిత్రక బంధాలను, ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని పటిష్టం చేస్తూ.. ఈ పర్యటన సాగనుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రశాంతత కోసం ఇరు దేశాలు కలిసి అడుగులు వేయడం వల్ల భవిష్యత్తులో బంధం మరింత బలపడుతుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.