Let's talk: editor@tmv.in
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ

Gaddamidi Naveen
8 జూన్, 2026

బొలీవేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ ఎలోయినా రోడ్రిగ్జ్ గోమెజ్ ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడికి విచ్చేసిన ఆమె శని, ఆదివారాల్లో బాబా సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

శనివారం శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న గోమెజ్‌కు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, ట్రస్ట్ సభ్యుడు మనోహర్ శెట్టి, ఇతరులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆమె నేరుగా ఆధ్యాత్మిక కేంద్రానికి చేరుకున్నారు. గోమెజ్ ప్రశాంతి నిలయాన్ని సందర్శించి, శ్రీ సత్యసాయి బాబా వారికి ప్రత్యేక పూజలు సమర్పించినట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

బాబా సన్నిధిలో ప్రార్థనలు

పర్యటనలో భాగంగా ఆమె శని, ఆదివారాల్లో సాయి కుల్వంత్ హాల్‌ను సందర్శించి, ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా వారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో నమస్కరించారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనలు, భజన కార్యక్రమాలలో ఆమె స్వయంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం మంగళ హారతి అనంతరం, భజన హాల్‌లో కొంత సమయం పాటు ఆమె ఏకాంతంగా ధ్యానంలో గడిపారు. ఆ తర్వాత సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులతో సమావేశమై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమెకు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రపటాన్ని ఆమెకు జ్ఞాపికగా అందజేశారు. అనంతరం ఆమె బాబా మహాసమాధి వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ప్రశాంతి నిలయం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

వెనిజులా నాయకురాలు గోమెజ్ గతంలోనూ పలుమార్లు ప్రశాంతి నిలయాన్ని సందర్శించారని ట్రస్ట్ ప్రతినిధులు గుర్తుచేశారు. శ్రీ సత్యసాయి బాబా వారు ప్రపంచానికి అందించిన ప్రేమ, శాంతి, నిస్వార్థ సేవా సందేశాల పట్ల ఆమెకు ఎంతో ప్రగాఢమైన గౌరవం, అభిమానం ఉన్నాయని వారు ఈ సందర్భంగా వెల్లడించారు.