Let's talk: editor@tmv.in
సాలార్ జంగ్ మ్యూజియంలో 'వర్ణ మైత్రి': మాస్టర్ ఆర్టిస్ట్ రుమాలే చెన్నబసవయ్య కళా ప్రస్థానం
సాలార్ జంగ్ మ్యూజియంలో 'వర్ణ మైత్రి': మాస్టర్ ఆర్టిస్ట్ రుమాలే చెన్నబసవయ్య కళా ప్రస్థానం

సాలార్ జంగ్ మ్యూజియంలో 'వర్ణ మైత్రి': మాస్టర్ ఆర్టిస్ట్ రుమాలే చెన్నబసవయ్య కళా ప్రస్థానం

Gaddamidi Naveen
22 ఏప్రిల్, 2026

హైదరాబాద్‌లోని ప్రముఖ సాలార్ జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ (75 ఏళ్లు) వేడుకల సందర్భంగా ఒక అరుదైన కళా ప్రదర్శన కొలువుదీరింది. ప్రఖ్యాత చిత్రకారుడు రుమాలే చెన్న బసవయ్య (1910-1988) జీవితం ఆయన అద్భుత కళాఖండాల సమాహారంగా రూపొందించిన 'వర్ణ మైత్రి' ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం ప్రారంభించారు.

బెంగళూరుకు చెందిన ప్రముఖ కళాకారుడు రుమాలే చెన్నబసవయ్య గీసిన సుమారు 80 అరుదైన చిత్రపటాలను హైదరాబాద్ ప్రజల కోసం మొదటిసారిగా సాలార్ జంగ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, పదాలకు అతీతంగా భావాలను పలికించే శక్తి కళకు ఉందని కొనియాడారు. రుమాలే చిత్రాలను చూస్తుంటే ప్రకృతితో ఆయనకు ఉన్న గాఢమైన అనుబంధం అర్థమవుతోంది. బెంగళూరులోని పచ్చని తోటలు, రంగురంగుల పూలను ఆయన చిత్రించిన తీరు అద్భుతం. ఒక స్వాతంత్ర్య సమరయోధునిగా, రాజకీయ నాయకునిగా, ఆధ్యాత్మికవేత్తగా ఉంటూనే.. 52 ఏళ్ల వయసులో మళ్ళీ కుంచె పట్టి ఇన్ని మాస్టర్‌పీస్‌లను సృష్టించడం ఆయన పట్టుదలకు నిదర్శనం అని గవర్నర్ పేర్కొన్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి రుమాలే

1910లో బెంగళూరు సమీపంలోని దొడ్డబల్లాపురలో జన్మించిన రుమాలే చెన్నబసవయ్య జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి. ఆయన జీవితంలో అనేక పాత్రలు పోషించారు. ఆయన కేవలం చిత్రకారుడే కాదు.. దేశ నిర్మాత, రాజకీయ నాయకుడు, సంపాదకుడు, ఆధ్యాత్మిక అన్వేషకుడు మరియు సామాజిక కార్యకర్తగా కూడా సేవలందించారు. 52 ఏళ్ల వయసులో స్వయంగా నేర్చుకున్న చిత్రలేఖనంతో తన రెండో ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రకృతిని ప్రేమిస్తూ, ఆరుబయట కూర్చుని సూర్యకాంతిలో మారుతున్న ప్రకృతి వర్ణాలను తన కాన్వాస్‌పై బంధించేవారు.

ఈ 'రెట్రోస్పెక్టివ్' ప్రదర్శనలో 1960 నుంచి 1980ల మధ్య కాలంలో ఆయన గీసిన వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. బెంగళూరులోని గుల్ మొహర్, జకరండా పూల అందాలు, కర్ణాటక, శ్రీలంకలోని ప్రకృతి దృశ్యాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. కూడలసంగమ వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు, తన గురువులైన శ్రీమాన్ తపస్విజీ మహారాజ్, శ్రీ శ్రీ శ్రీ శివబాలయోగి మహారాజ్ చిత్రపటాలను కూడా ఇందులో ఉంచారు. పెయింటింగ్స్‌తో పాటు ఆయన జీవితానికి సంబంధించిన అరుదైన ఛాయాచిత్రాలు, స్కెచ్‌లు, ఆడియో-విజువల్ మెటీరియల్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

మ్యూజియం డైరెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ, రుమాలే అద్భుతమైన దృశ్య భాషను కలిగి ఉన్నారని, ఆయన చిత్రాలను హైదరాబాద్‌లో ప్రదర్శించడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రదర్శనను ప్రఖ్యాత కళా విమర్శకుడు కె.ఎస్. శ్రీనివాస మూర్తి క్యూరేట్ చేశారు. ఆయన మాట్లాడుతూ, రుమాలే చిత్రాలు చూసే కొద్దీ కొత్త అర్థాలను విప్పి చెబుతాయని, అవి చాలా నిశ్శబ్దంగా ప్రజల మనసులను తాకుతాయని అన్నారు.

ఈ సందర్భంగా రుమాలే రాసిన ఆత్మకథ ఆంగ్ల అనువాదం 'రుమాలే: ది ఆర్టిస్ట్ ఇన్ హిస్ వర్డ్స్' పుస్తకాన్ని సాఫ్ట్ రిలీజ్ చేశారు. చిత్రకారుని మాటల్లోనే ఆయన కళా ప్రస్థానాన్ని తెలుసుకునే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. ఈ ప్రత్యేక ప్రదర్శన మే 25, 2026 వరకు కొనసాగుతుంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. శుక్రవారం మ్యూజియం మూసివేస్తారు. ప్రవేశం మ్యూజియం టికెట్‌తో ఉంటుంది.