Let's talk: editor@tmv.in
జనగణమనతో 'వందేమాతరం'కు సమాన హోదా ఇవ్వలేం: ఎంపీ అసదుద్దీన్

జనగణమనతో 'వందేమాతరం'కు సమాన హోదా ఇవ్వలేం: ఎంపీ అసదుద్దీన్

Gaddamidi Naveen
9 మే, 2026

జాతీయ గీతం 'జనగణమన'కు ఉన్న చట్టబద్ధమైన రక్షణను 'వందేమాతరం' గేయానికి కూడా కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం ఒక దేవతను స్తుతించే పాట అని, దానిని జాతీయ గీతంతో సమానంగా పరిగణించలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

జనగణమన భారతదేశాన్ని, ప్రజలను కొనియాడుతుంది, కానీ ఒక నిర్దిష్ట మతాన్ని కాదు. దేశం అంటే మతం కాదు. వందేమాతరం రాసిన వ్యక్తి బ్రిటీష్ పాలన పట్ల సానుభూతి కలిగి ఉండటమే కాకుండా, ముస్లింలను ద్వేషించేవారు. అందుకే నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీ, నెహ్రూ, ఠాగూర్ కూడా దీనిని పూర్తిగా అంగీకరించలేదని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని పీఠిక “మేము భారత ప్రజలు” అనే పదాలతో ప్రారంభమవుతుందని, “భారత్ మాత” అనే భావనతో కాదని ఓవైసీ గుర్తు చేశారు. ఆ పీఠికలో ఆలోచన, వ్యక్తీకరణ, విశ్వాసం, నమ్మకం, ఆరాధనలకు స్వేచ్ఛ హామీ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో “ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్య”గా నిర్వచించారని చెప్పారు.

రాజ్యాంగ సభ చర్చలను ప్రస్తావిస్తూ, పీఠికను ఒక దేవత పేరుతో ప్రారంభించాలని కొందరు సభ్యులు కోరినట్లు, మరికొందరు “దేవుని పేరుతో” ప్రారంభించాలని, “దాని పౌరులు” అనే పదబంధం స్థానంలో ఆమె పౌరులు అని మార్చాలని సూచించినట్లు తెలిపారు. అయితే ఆ సవరణలన్నీ తిరస్కరించబడ్డాయని అన్నారు. ఇండియా అంటే అక్కడి ప్రజలు. దేశం దేవత కాదు. అది ఏ దేవుడు లేదా దేవత పేరుతో నడవదు. అలాగే ఏ ఒక్క దేవుడు లేదా దేవతకు చెందింది కాదు అని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ తీవ్ర స్పందన

ఓవైసీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఘాటుగా స్పందించారు. సాంస్కృతిక ఐక్యతను ఎంఐఎం నాయకత్వం తమ మతపరమైన ప్రత్యేకతకు ముప్పుగా భావిస్తోందని విమర్శించారు. ఓవైసీ ధోరణి మహమ్మద్ అలీ జిన్నాను పోలి ఉందని ఆయన ఆరోపించారు. జిన్నా కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వందేమాతరం పట్ల అభ్యంతరం తెలపలేదని, కాంగ్రెస్ వీడిన తర్వాతే రాజకీయ ప్రయోజనాల కోసం వ్యతిరేకత మొదలుపెట్టారని ఆయ‌న‌ గుర్తుచేశారు. వందేమాతరంతో పాటు ఉమ్మడి పౌర స్మృతి, త్రిపుల్ తలాక్ రద్దు వంటి ప్రతి అంశాన్ని ఎంఐఎం వ్యతిరేకించడం వెనుక కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే ఉన్నాయని ఆయన మండిపడ్డారు. జాతీయ సమగ్రతను దెబ్బతీసే మనస్తత్వం ఇదని ధ్వజమెత్తారు.

జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం, 1971కి సవరణలు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం, జాతీయ గీతం లాగే వందేమాతరం గానాన్ని అడ్డుకోవడం లేదా అవమానించడం ఇకపై శిక్షార్హమైన నేరం అవుతుంది. ఈ నిర్ణయం ద్వారా వందేమాతరానికి జాతీయ గీతంతో సమానమైన చట్టబద్ధమైన హోదా లభించనుంది. ఈ నిర్ణయమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

జనగణమనతో 'వందేమాతరం'కు సమాన హోదా ఇవ్వలేం: ఎంపీ అసదుద్దీన్ - Tholi Paluku