Let's talk: editor@tmv.in
తెలంగాణాలో ఘనంగా వనమహోత్సవం - 2026
తెలంగాణాలో ఘనంగా వనమహోత్సవం - 2026
తెలంగాణాలో ఘనంగా వనమహోత్సవం - 2026

తెలంగాణాలో ఘనంగా వనమహోత్సవం - 2026

Dantu Vijaya Lakshmi Prasanna
19 జూన్, 2026

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తీర్ణం పెంపు, వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా ఎల్‌బీ నగర్ నియోజకవర్గం గుర్రంగూడ ఎకోపార్క్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మొక్కను నాటి ‘వనమహోత్సవం - 2026’ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎకో పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వనాల పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ కోసం రూ.35.50 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనే రూ.17.84 కోట్ల నిధులతో చేపట్టనున్న వివిధ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడటం ద్వారానే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానంలో ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు

గుర్రంగూడ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించిన పర్యావరణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వర్చువల్ (డిజిటల్) విధానంలో ప్రారంభించారు. నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ వంటి 11 జిల్లాల్లో రూ.17.66 కోట్ల విలువైన అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు.

ఈ నిధులతో ఆయా జిల్లాల్లో అర్బన్ పార్కులు, ఎకో పార్కుల నిర్మాణం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు, జూ పార్కుల ఆధునీకరణ, అటవీ శాఖ ఉద్యోగుల నివాస భవనాలు, పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక పనులను చేపట్టడం జరిగింది. ఈ చర్యల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం మరింత విస్తరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

మూసీ రివర్ ఫ్రంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రతిజ్ఞ

తెలంగాణ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి సభా ముఖంగా పునరుద్ఘాటించారు. దేశంలోని ప్రముఖ మహానగరాలైన ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు నగరాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన కాలుష్యం, ఆకస్మిక వరదల వంటి దుస్థితి భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకూడదనే సంకల్పంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయంగా లేదా మరే ఇతర రూపంలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, విమర్శలు చేసినా వెనక్కి తగ్గేదే లేదని భరోసా ఇచ్చారు.

గండిపేట నుంచి గౌరెల్లి వరకు దాదాపు 55 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ నది ప్రక్షాళన, రివర్‌ఫ్రంట్ నిర్మించే పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు. దేశంలో ఇప్పటికే ఉన్న సబర్మతీ, గంగా, యమునా రివర్‌ఫ్రంట్ల కంటే అత్యంత అద్భుతంగా మూసీని తీర్చిదిద్దుతామని, ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షించే విధంగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని సైతం అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తూర్పు హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి - గుర్రంగూడ భూముల రక్షణ

గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అభివృద్ధి పనులన్నీ కేవలం ఒకే ఒక్క ప్రాంతం వైపు కేంద్రీకృతమయ్యాయని, నగరానికి కూతవేటు దూరంలో ఉన్న తూర్పు హైదరాబాద్ ప్రాంతాలైన ఎల్‌బీ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, గుర్రంగూడ, బైరామల్ గూడ, సాయబ్ నగర్ వంటి ప్రాంతాలు తీవ్ర వివక్షకు గురై అభివృద్ధికి నోచుకోలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. ఈ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన తమ ప్రభుత్వం, ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.2,400 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మిస్తోందని గుర్తుచేశారు.

కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్లకుండా గుర్రంగూడలోని విలువైన ప్రభుత్వ స్థలాన్ని సుప్రీంకోర్టులో బలంగా వాదించి కాపాడుకున్నామని వెల్లడించారు. ఈ స్థలంలో నేషనల్ పార్క్ కోసం 100 ఎకరాలను కేటాయించామని, మొత్తం ఎల్‌బీ నగర్ పరిధిలోని 424 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి పార్కును నిర్మించడానికి అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గతంలో ఇక్కడి ప్రజలు సీరీస్ ఫ్యాక్టరీ కాలుష్యం కారణంగా పడిన ఇబ్బందులను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.

హైడ్రా కఠిన చర్యలు, ఆక్రమణల నిర్మూలన

నగరంలో చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలు, అక్రమ కబ్జాల కారణంగానే వర్షపు నీరు సజావుగా వెళ్లే మార్గం లేక, భారీ వర్షాలు పడినప్పుడల్లా బస్తీలకు బస్తీలు జలమయం అవుతున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు ఇటువంటి కష్టాలు మళ్లీ రాకూడదనే దృఢ సంకల్పంతోనే, కబ్జాకోరుల కోరలు పీకడానికి 'హైడ్రా' (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ని రంగంలోకి తెచ్చామని స్పష్టం చేశారు. కొద్దిమంది స్వార్థపరులు చేసే కబ్జాల వల్ల వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితిని ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించబోదని హెచ్చరించారు. చెరువులు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేస్తే హైడ్రా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక పర్యావరణ, అభివృద్ధి కార్యక్రమాలలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.