Let's talk: editor@tmv.in
ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా వైశాలి

ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా వైశాలి

Shaik Mohammad Shaffee
16 ఏప్రిల్, 2026

భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. వైశాలి కొత్త చరిత్ర లిఖించారు. బుధవారం ముగిసిన ఫిడే మహిళల కాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో ఆమె అద్భుత ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన చివరి రౌండ్‌లో రష్యా క్రీడాకారిణి కతెరీనా లగ్నోను మట్టికరిపించిన వైశాలి, మొత్తం 8.5 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రక విజయంతో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, చైనాకు చెందిన జు వెన్జున్‌తో తలపడే అరుదైన అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. ఈ ఏడాది చివరలో వీరిద్దరి మధ్య ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ పోరు జరగనుంది.

తెల్లటి పావులతో ‘చెక్’

నిర్ణయాత్మకమైన చివరి రౌండ్‌లో తెల్లటి పావులతో ఆడిన వైశాలి, ఆరంభం నుంచే పైచేయి సాధించారు. అత్యంత ఒత్తిడితో కూడిన ఈ గేమ్‌లో ఎక్కడా తడబడకుండా, క్లినికల్ ప్రదర్శనతో లగ్నోను ఓడించారు. టోర్నీ ఆరంభంలో తక్కువ రేటింగ్‌తో బరిలోకి దిగినప్పటికీ, అంచనాలను తలకిందులు చేస్తూ వైశాలి టైటిల్‌ను ముద్దాడటం విశేషం. 2024లో కేవలం 7.5 పాయింట్లతో సరిపెట్టుకున్న ఆమె, ఈసారి తన స్కోరును మెరుగుపరుచుకుని తిరుగులేని విజేతగా అవతరించారు. గతంలో కోనేరు హంపి సాధించిన ఘనత తర్వాత, మరో భారత మహిళా క్రీడాకారిణి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

తమ్ముడిని మించిన అక్క

ఇప్పటివరకు తన తమ్ముడు ఆర్‌. ప్రజ్ఞానంద సాధించిన విజయాల నీడలో ఉన్నట్లు కనిపించిన వైశాలి, ఇప్పుడు ప్రపంచ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. 24 ఏళ్ల వైశాలి సాధించిన ఈ ఘనతను ఆమె కోచ్ ఆర్‌.బి. రమేష్ కొనియాడారు. "ప్రపంచ ఛాంపియన్‌షిప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీకి అర్హత సాధించడం చాలా గర్వకారణం.. కీలక సమయంలో వైశాలి తన సహనాన్ని కోల్పోకుండా ఆడింది" అని ఆయన పేర్కొన్నారు. 2024లో గుకేష్ ఏ విధంగా అయితే సంచలనం సృష్టించారో, వైశాలి కూడా అదే తరహాలో విజయం సాధించడం గమనార్హం.

సిందారోవ్‌తో గుకేష్ సమరం

మరోవైపు ఓపెన్ విభాగంలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జవోఖిర్ సిందారోవ్ 9.5 పాయింట్లతో టైటిల్‌ విజేతగా నిలిచారు. బుధవారం జరిగిన చివరి రౌండ్‌లో చైనా ఆటగాడు వీ యీ తో గేమ్‌ను డ్రా చేసుకున్న సిందారోవ్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, భారత్‌కు చెందిన డి. గుకేష్‌ను సవాలు చేయనున్నారు. భారత యంగ్ స్టార్ ప్రజ్ఞానంద తన చివరి గేమ్‌ను అమెరికా దిగ్గజం హికారు నకమురాతో డ్రా చేసుకుని టోర్నీని ముగించారు. నెదర్లాండ్స్‌కు చెందిన అనీష్ గిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.

మహిళల పట్టికలో భారత్ హవా

మహిళల విభాగంలోని ఇతర గేమ్‌లలో భారత్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్, కజకిస్థాన్ క్రీడాకారిణి బిబిసారాతో గేమ్‌ను డ్రా చేసుకున్నారు. బిబిసారా 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, వైశాలి 8.5 పాయింట్లతో అగ్రపీఠాన్ని అలంకరించారు. ఈ విజయంతో భారత చెస్ కీర్తి ప్రపంచ యవనికపై మరోసారి రెపరెపలాడింది.