
వ్యవసాయంలో ఏఐ వినియోగం... యాప్ ద్వారానే యూరియా బుకింగ్: సీఎం రేవంత్ రెడ్డి
వ్యవసాయ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. రైతులకు విత్తనాల సరఫరా ఉత్పాదకత నుంచి పంటల కొనుగోలు ప్రక్రియ వరకు ప్రతి దశలోనూ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించాలని స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రక్రియకు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించాలని ఆయన సూచించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డి బోధి పెవిలియన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి ఆయన వ్యవసాయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
విత్తనాల పంపిణీ నుంచి తుది పంట సేకరణ వరకు సాగులోని వివిధ దశలపై ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఏ సీజన్‌లో ఏ రైతు సాగు ప్రారంభించారు, వారు వేసిన పంటలు ఏమిటి, ఆశించిన దిగుబడి అంచనాలు, తదుపరి కొనుగోళ్ల వివరాల వంటి పూర్తి డేటా వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఒక గ్రామంలో ఏయే పంటలు సాగవుతున్నాయనే వివరాలను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ఈ సాగు ప్రక్రియలను పర్యవేక్షించడానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి, వ్యవసాయ శాఖ డైరెక్టర్, పౌరసరఫరాల శాఖ ఎండీ, ప్రణాళికా శాఖ కార్యదర్శితో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
సన్న వడ్ల బోనస్
సన్న వడ్లు పండించే రైతులకు ప్రభుత్వం బోనస్ ఇస్తున్నందున, ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల్లోనే సబ్సిడీపై అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. రైతు వేదికలను ఇకపై రైతులు వివరాలు నమోదు చేసుకుని, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని, జిల్లాల్లో వీటి పర్యవేక్షణ బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని చెప్పారు.
వ్యవసాయంలో ఏఐ, యాప్ ద్వారా యూరియా బుకింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను అధ్యయనం చేసి, వ్యవసాయ శాఖలో ఈ సాంకేతికతను విస్తరించాలని సీఎం పేర్కొన్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం అన్ని రకాల ఫెర్టిలైజర్లను యాప్ ద్వారా బుక్ చేసే విధానాన్ని తీసుకురావాలని, యాప్ ద్వారా బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారానే అదనపు కలెక్టర్ల పర్యవేక్షణలో పంపిణీ చేయాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటాలు కనీస మద్దతు ధర ప్రకారం పంటల కొనుగోళ్లు సజావుగా సాగాలని సీఎం చెప్పారు. అకాల వర్షాలు, పంట రవాణా వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో తెలంగాణకు గరిష్ట వాటా కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్తుందని తెలిపారు.
గతంలో టన్ను మొక్కజొన్నను రూ.13 వేలకు అమ్మగా, ఈసారి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి రూ.21 వేలకు పైగా టెండర్ రేట్ సాధించడం ద్వారా మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించగలిగామని సీఎం చెప్పారు. అలాగే ఆయిల్‌ఫెడ్, ప్రభుత్వ డైరీలను మరింత బలోపేతం చేయాలని, పాల రైతులకు సకాలంలో చెల్లింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.
