
ఇరాన్‌కు సాయం చేస్తే.. చైనా బ్యాంకులకు అమెరికా హెచ్చరిక
ఇరాన్ దేశానికి ఆర్థికంగా సహాయం చేస్తున్న చైనా బ్యాంకులకు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ చమురు వ్యాపారానికి, ఇతర నగదు లావాదేవీలకు సహకరిస్తే, ఆయా బ్యాంకులపై కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేస్తూ, ఇరాన్ ఆదాయ మార్గాలను అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ తన చమురును అమ్ముకోవడం ద్వారా వచ్చే డబ్బును ఉగ్రవాద సంస్థలకు మళ్లిస్తోందని, దీనివల్ల ప్రపంచానికి ముప్పు ఉందని అమెరికా భావిస్తోంది. చైనా వంటి దేశాలు భారీగా చమురు కొనడం వల్లే ఇరాన్ ఆర్థికంగా బలంగా ఉందని, ఆ బలాన్ని దెబ్బతీయాలని అమెరికా ప్లాన్ చేస్తోంది.
చైనా బ్యాంకులపై నిఘా
చైనాలోని రెండు ప్రధాన బ్యాంకులకు అమెరికా ఇప్పటికే లేఖలు రాసింది. ఆ బ్యాంకుల పేర్లను బయటపెట్టకపోయినప్పటికీ, ఇరాన్ డబ్బు గనుక ఆ బ్యాంకుల ఖాతాల ద్వారా చేతులు మారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. చైనా తన ఇంధన అవసరాల కోసం రష్యా, ఇరాన్ వంటి దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది, అందుకే అమెరికా ఇప్పుడు నేరుగా బ్యాంకులపై నిఘా పెంచింది.
ట్రంప్-జిన్‌పింగ్ మధ్య చర్చలు
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో చైనా అధ్యక్షుడితో చర్చలు జరిపారు. ఇరాన్‌కు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. అంతర్జాతీయంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు చైనా కూడా మద్దతు ఇస్తోందని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు.
భారీగా పన్నుల బాదుడు
ఇరాన్‌కు సైనికపరంగా. ఆర్థికంగా మద్దతు ఇచ్చే దేశాలపై అమెరికా కేవలం ఆంక్షలతోనే ఆగడం లేదు. అవసరమైతే ఆ దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఏకంగా 50 శాతం వరకు పన్నులు (టారిఫ్స్) వేస్తామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. దీనివల్ల ఇరాన్‌కు సహకరించే దేశాలు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ అమెరికా తన ఆర్థిక అస్త్రాలను ప్రయోగిస్తోంది.
