Let's talk: editor@tmv.in
రష్యా చమురుపై అమెరికా యూటర్న్.. మళ్లీ ఆంక్షల సడలింపు

రష్యా చమురుపై అమెరికా యూటర్న్.. మళ్లీ ఆంక్షల సడలింపు

Shaik Mohammad Shaffee
24 ఏప్రిల్, 2026

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లపై విధిస్తున్న ఆంక్షల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా చమురు విక్రయాలకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన మినహాయింపును మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ బుధవారం సెనేట్ అప్రాప్రియేషన్స్ కమిటీ ముందు హాజరై ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచంలోని పదికి పైగా దేశాల నుంచి వచ్చిన విన్నపాన్ని మన్నించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

తీవ్ర ఒత్తిడితో మారిన నిర్ణయం

నిజానికి రష్యా, ఇరాన్ నుంచి చమురు విక్రయాలకు సంబంధించి ఇకపై ఎటువంటి ఆంక్షల సడలింపులు ఇచ్చేది లేదని గత వారమే బెస్సెంట్ స్పష్టం చేశారు. అయితే గత వారం వాషింగ్టన్‌లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా పదికి పైగా దేశాల ప్రతినిధులు ఆయనను కలిశారు. ఇంధన కొరతతో సతమతమవుతున్న తమ వంటి పేద దేశాలను ఆదుకోవాలని, ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించాలని వారు కోరారు. ఈ దేశాల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న అమెరికా ట్రెజరీ విభాగం, గత శుక్రవారమే 30 రోజుల పాటు తాత్కాలిక సడలింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తాత్కాలికంగా మాత్రమే వెసులుబాటు

"ముందుగా ఈ మినహాయింపును పొడిగించకూడదనే మేము భావించాం. కానీ ఇంధన పరంగా అత్యంత బలహీన స్థితిలో ఉన్న దేశాలు మమ్మల్ని సంప్రదించి, తమ ఇబ్బందులను వివరించాయి. వారి అభ్యర్థన మేరకే కేవలం 30 రోజుల కాలపరిమితితో ఈ ఆంక్షల మినహాయింపును పొడిగించాం" అని స్కాట్ బెస్సెంట్ సెనేట్ కమిటీకి వివరించారు. ఈ స్వల్పకాలిక ఉపశమనం ఆయా దేశాలకు ఇంధన కొనుగోళ్లలో కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

భారత్‌కు గతంలోనే మినహాయింపు

రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా గతంలోనే భారత్‌కు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. మార్చి 5 నుంచి నెల రోజుల పాటు భారత్ రష్యా చమురును కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చింది. ఆ తర్వాత మరికొన్ని దేశాలకు కూడా ఏప్రిల్ 11 వరకు ఇలాంటి మినహాయింపులే లభించాయి. తాజాగా తీసుకున్న 30 రోజుల పొడిగింపు నిర్ణయం ద్వారా ప్రపంచ ఇంధన మార్కెట్‌లో ఒత్తిడిని తగ్గించి, పేద దేశాలపై ఆర్థిక భారం పడకుండా చూడాలని అమెరికా భావిస్తోంది.