Let's talk: editor@tmv.in
యూఎస్ ఓపెన్ పికిల్‌బాల్‌: భారత్‌కు మరో స్వర్ణం

యూఎస్ ఓపెన్ పికిల్‌బాల్‌: భారత్‌కు మరో స్వర్ణం

Shaik Mohammad Shaffee
17 ఏప్రిల్, 2026

అమెరికా గడ్డపై భారత పికిల్‌బాల్ క్రీడాకారులు తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ పికిల్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్లు అర్జున్ సింగ్, ఆదిత్య సింగ్ సోదరులు అద్భుత ప్రదర్శనతో మరో స్వర్ణ పతకాన్ని ముద్దాడారు. ఫ్లోరిడాలోని నేపుల్స్‌లో జరిగిన పురుషుల డబుల్స్ 5.0 విభాగం ఫైనల్‌లో ఈ భారత జోడీ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

ఉత్కంఠ పోరులో అద్భుత విజయం

హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్జున్ సింగ్ - ఆదిత్య సింగ్ ద్వయం 9-11, 11-2, 11-7 తేడాతో జె. మోడ్ - డబ్ల్యూ. లిన్ జోడీపై ఘనవిజయం సాధించింది. తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ, తర్వాతి రెండు సెట్లలో భారత సోదరులు పుంజుకున్న తీరు అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రెండో సెట్‌లో 11-2తో ప్రత్యర్థిని చిత్తు చేసి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. నిర్ణయాత్మక మూడో సెట్‌లోనూ అదే దూకుడును ప్రదర్శించి పసిడిని కైవసం చేసుకున్నారు.

రజతంతో మెరిసిన పంత్ - అథర్వ

ఇదే టోర్నీలో భారత దేశానికి చెందిన మరో జోడీ కూడా మెడల్‌తో మెరిసింది. 4.5 పురుషుల డబుల్స్ విభాగంలో పంత్ థక్కర్ - అథర్వ షెత్ జోడీ రజత పతకాన్ని గెలుచుకుంది. టైటిల్ పోరులో కైన్ అప్పెల్ - మైఖేల్ వాన్ డ్యూసెన్ జంటతో తలపడిన వీరు 8-11, 9-11 తేడాతో పోరాడి ఓడి రన్నరప్‌గా నిలిచారు. పతక పోరులో చివరి వరకు గట్టి పోటీని ఇచ్చి భారత్ కీర్తిని చాటారు.

హ్యాట్రిక్ స్వర్ణం.. సోదరుల సంబరం

ఈ విజయంతో అర్జున్ సింగ్ అరుదైన ఘనత సాధించారు. ఈ టోర్నీలో అర్జున్‌కు ఇది మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. కాగా తన సోదరుడు ఆదిత్యతో కలిసి రెండోసారి బంగారు పతకాన్ని ముద్దాడారు. అంతకుముందు ఇదే టోర్నీలో ఈ సోదరులిద్దరూ కలిసి యూ-18 బాయ్స్ డబుల్స్ టైటిల్‌ను కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

విజయం అనంతరం అర్జున్, ఆదిత్య మాట్లాడుతూ.. "యూఎస్ ఓపెన్‌లో మరో స్వర్ణం గెలవడం చాలా గర్వంగా ఉంది. అది కూడా అన్నదమ్ములం కలిసి సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకం చేసింది. మా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మద్దతు వల్లే ఇది సాధ్యమైంది. భవిష్యత్తులోనూ ఇలాంటి మరిన్ని విజయాలు సాధించడానికి కష్టపడతాం" అని ఆనందం వ్యక్తం చేశారు.

యూఎస్ ఓపెన్ పికిల్‌బాల్‌: భారత్‌కు మరో స్వర్ణం - Tholi Paluku