
ఇరాన్‌తో యుద్ధం వేళ.. అమెరికా నౌకాదళ కార్యదర్శి ఆకస్మిక రాజీనామా
అమెరికా రక్షణ రంగంలో భారీ కుదుపు చోటుచేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యున్నత స్థాయి రక్షణ పదవుల నుంచి వైదొలుగుతున్న అధికారుల పరంపర కొనసాగుతోంది. తాజాగా నౌకాదళ (నేవీ) కార్యదర్శి జాన్ ఫెలాన్ బుధవారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి షాన్ పార్నెల్ వెల్లడించారు. ఫెలాన్ తక్షణమే విధులను వీడనున్నారని, ఆయన స్థానంలో ప్రస్తుత అండర్ సెక్రటరీ హంగ్ కావ్ తాత్కాలికంగా బాధ్యతలు చేపడతారని ప్రకటించారు.
అయోమయంలో అమెరికా నౌకాదళం
జాన్ ఫెలాన్ వైదొలగడం వెనుక గల కచ్చితమైన కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే మంగళవారం నాటి వార్షిక సదస్సులో కూడా నౌకాదళ బడ్జెట్, నౌకల నిర్మాణంపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన ఫెలాన్.. మరుసటి రోజే ఇలా తప్పుకోవడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే ట్రంప్ సర్కార్‌లో రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ పలువురు ఉన్నతాధికారులను తొలగించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2025 నుంచి ఇప్పటివరకు ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్, నేవీ అధికారి అడ్మిరల్ లిసా ఫ్రాంకెట్టి వంటి దిగ్గజాలపై వేటు పడింది. ఈ వరుస తొలగింపులు పెంటగాన్‌లో అస్థిరతకు దారితీస్తాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
యుద్ధ మేఘాల మధ్య నాయకత్వ మార్పు
పశ్చిమాసియాలో ఇరాన్ రేవులపై అమెరికా నౌకాదళం దిగ్బంధనం కొనసాగిస్తున్న కీలక సమయంలో ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఇరాన్‌తో కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, అది ఎప్పుడైనా ముగియవచ్చని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇప్పటికే మూడు యుద్ధనౌకలను అమెరికా మధ్యప్రాచ్యంలో మోహరించింది. మరోవైపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడటంలోనూ, కరీబియన్ సముద్రంలో డ్రగ్స్ మాఫియాపై దాడుల్లోనూ అమెరికా నౌకాదళం చురుగ్గా పాల్గొంటోంది.
ఎవరీ హంగ్ కావ్?
1970లలో వియత్నాం నుంచి శరణార్థిగా అమెరికా వచ్చి, ఇప్పుడు అదే దేశ నౌకాదళానికి తాత్కాలిక బాధ్యతలు చేపట్టే స్థాయికి హంగ్ కావ్ ఎదిగారు. ఆయన సుమారు 25 ఏళ్ల పాటు అమెరికా నౌకాదళంలో స్పెషల్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పనిచేసి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి యుద్ధ క్షేత్రాల్లో పోరాడాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి వర్జీనియా నుంచి పోటీ చేసినా గెలవలేదు కానీ, అధ్యక్షుడు ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. సైన్యంలో అనవసర మార్పులను వ్యతిరేకించే ఆయన, "సైన్యానికి కావాల్సింది మేకప్‌లు వేసుకునే వారు కాదు.. ప్రాణాలకు తెగించి పోరాడే అసలైన వీరులే" అని నిర్మొహమాటంగా చెబుతుంటారు. తన పోరాట పటిమ, కఠిన నిర్ణయాల వల్ల ఆయన ట్రంప్ సర్కార్‌లో కీలక నేతగా ఎదిగారు.
ఒకవైపు నేవీలో మార్పులు జరుగుతుండగానే, మరోవైపు ఇరాన్‌తో దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమేనని అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చలపై ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ఇరాన్ ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రతిపాదనతో వస్తుందని భావిస్తున్నట్లు 'న్యూయార్క్ పోస్ట్'కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. కాగా ఈ రాజకీయ, సైనిక పరిణామాలు రానున్న రోజుల్లో అమెరికా రక్షణ రంగాన్ని ఏ దిశగా నడిపిస్తాయో చూడాలి.
