Let's talk: editor@tmv.in
అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం

అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం

Shaik Mohammad Shaffee
30 ఏప్రిల్, 2026

అమెరికా కలలతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులను పరిశీలించే భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 'ఎన్‌హ్యాన్స్‌డ్' (మరింత క్షుణ్ణంగా) సెక్యూరిటీ చెక్స్ పూర్తయితే తప్ప, ఏ ఒక్క దరఖాస్తును కూడా ఆమోదించవద్దని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) తన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గత వారం పంపిన అంతర్గత మార్గదర్శకాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి.

సోమవారం నుంచే అమలు

అమెరికా అంతర్గత భద్రతా విభాగం పరిధిలోని యూఎస్‌సీఐఎస్ అధికారులు ఈ సోమవారం (ఏప్రిల్ 27) నుంచే కొత్త నిబంధనలను అమలు చేయడం ప్రారంభించారు. ఎఫ్‌బీఐ నిర్వహిస్తున్న 'నెక్స్ట్ జనరేషన్ ఐడెంటిఫికేషన్' సిస్టమ్ ద్వారా దరఖాస్తుదారుల పూర్తి స్థాయి నేర చరిత్రను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

ఏప్రిల్ 27 కంటే ముందు వేలిముద్రలు సమర్పించి, ఇంకా తుది నిర్ణయం వెలువడని పెండింగ్ దరఖాస్తులను కూడా మళ్లీ వెరిఫై చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల వేలాది మంది దరఖాస్తుదారులు మరోసారి వేలిముద్రలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. కొత్త నిబంధనల ప్రకారం భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు గ్రీన్ కార్డ్, పౌరసత్వ దరఖాస్తులపై ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు.

ఎవరిపై ప్రభావం?

ఈ మార్పులు ప్రధానంగా శాశ్వత నివాసం (గ్రీన్ కార్డు) కోసం వేచి చూస్తున్న భారతీయులతో పాటు ఇతర దేశాల వలసదారులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. పౌరసత్వం, శరణార్థుల దరఖాస్తులు కూడా ఈ కఠిన తనిఖీల పరిధిలోకి వస్తాయి. భద్రతా తనిఖీల పేరుతో ప్రక్రియను పొడిగించడం వల్ల అంగీకార పత్రాలు రావడంలో జాప్యం జరగనుంది.

భద్రతే ధ్యేయంగా ట్రంప్ నిర్ణయాలు

2025లో రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విషయంలో తనదైన కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దేశ భద్రతను కాపాడటం, అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా గత ఫిబ్రవరిలో ఆయన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఫెడరల్ నేర పరిశోధన సంస్థల వద్ద ఉన్న ప్రతి సమాచారాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు పూర్తి స్థాయిలో వడపోయాలన్నదే ఈ నిర్ణయ సారాంశం.

హక్కుల సంఘాల ఆందోళన

ప్రభుత్వ తాజా ఆదేశాలపై మానవ హక్కుల సంఘాలు, సివిల్ రైట్స్ గ్రూపులు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల దరఖాస్తుదారుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగడమే కాకుండా, అనవసరమైన జాప్యంతో వలసదారులు మానసిక వేదనకు గురవుతారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తనిఖీల వల్ల ఏర్పడే జాప్యం తాత్కాలికమేనని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది తప్పనిసరని యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం - Tholi Paluku