Let's talk: editor@tmv.in
తెలంగాణ‌లో ‘మీసేవ’ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్!

తెలంగాణ‌లో ‘మీసేవ’ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్!

Gaddamidi Naveen
9 జులై, 2026

రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న యూరియా బుకింగ్ సేవను ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా కూడా అందించనున్నట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించలేని రైతులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుంది.

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ఉపయోగించలేని రైతులు తమకు సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి, అక్కడి ఆపరేటర్ సహాయంతో సబ్సిడీ యూరియాను సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని మీసేవ వ్యవస్థ, వ్యవసాయశాఖతో సమన్వయంతో ఈ కొత్త సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల యూరియా పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు సకాలంలో ఎరువులు అందించే అవకాశం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ సేవను పొందేందుకు రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ (పీపీబీ) నంబర్‌తో సమీప మీసేవ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ మీసేవ ఆపరేటర్ రైతు వివరాలు, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేసి, రైతు కోరుకున్న ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేస్తారు. అనంతరం రైతు నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ధృవీకరించిన వెంటనే బుకింగ్ ఐడీ జారీ చేయబడుతుంది.

మీసేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడీ, బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఆ గడువు ముగిసేలోపు రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ను సంప్రదించి యూరియాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సేవ కోసం కేవలం రూ.10 నామమాత్రపు సేవా రుసుము మాత్రమే వసూలు చేయనున్నారు. ఓటీపీ అందుకోవడానికి పట్టాదారు పాస్‌బుక్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ తప్పనిసరిగా యాక్టివ్‌లో ఉండాలని వ్యవసాయశాఖ సూచించింది.

రైతులు సబ్సిడీ యూరియా బుకింగ్‌ను అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీసేవ కేంద్రాల ద్వారానే చేయాలని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలు లేదా సాంకేతిక సహాయం అవసరమైతే సమీప వ్యవసాయ విస్తరణ అధికారి, మండల వ్యవసాయ అధికారి లేదా మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది. రాష్ట్రంలోని రైతులందరూ ఈ కొత్త సౌకర్యాన్ని వినియోగించుకుని సబ్సిడీ యూరియాను అధికారిక విధానం ద్వారా పొందాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేసింది.

ట్యాగ్‌లు
UreaBookingMeeSevaSubsidyUreaFarmersAgricultureTelanganaTelanganaFarmersFarmerWelfareDigitalServicesAgriUpdatesFertilizerRythu
తెలంగాణ‌లో ‘మీసేవ’ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్! - Tholi Paluku