
యూరియా యాప్‌ను రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. యూరియా పంపిణీ కోసం ప్రవేశపెట్టిన నూతన మొబైల్ యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పాలిస్తున్న రేవంత్‌రెడ్డి, దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ ఇద్దరూ తోడు దొంగల్లా మారి రైతులను నట్టేట ముంచుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వందశాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, ఈ వివాదాస్పద యాప్ వల్ల వారికి యూరియా దొరక్క అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 75 వేల మంది రైతుల పక్షాన తాము పోరాడుతున్నామని, సమస్య తీర్చకుంటే పాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతుబీమా అందించి రైతును రాజుగా చూశారని ఆయన గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీమా సంస్థలకు ప్రీమియం డబ్బులు కట్టకపోవడంతో రైతుబీమా నిలిచిపోయిందని, అటు ఉచిత విద్యుత్ కూడా దూరమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఉంటే, నేడు 8 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. క్వింటాలు వడ్లకు 10 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటుంటే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎక్కడ దాక్కున్నారు? కనీసం ఒక్క రోజైనా రైస్ మిల్లులను సందర్శించారా?అంటూ సురేందర్ నిలదీశారు. కాంగ్రెస్ నాయకులకు హైదరాబాద్‌లో భూములు అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవడంపై ఉన్న శ్రద్ధ, రైతుల కష్టాలపై లేదని ఆయన ధ్వజమెత్తారు.
