Let's talk: editor@tmv.in
ఒడిశాలో కలకలం.. అక్క అస్థిపంజరంతో బ్యాంక్‌కు తమ్ముడు

ఒడిశాలో కలకలం.. అక్క అస్థిపంజరంతో బ్యాంక్‌కు తమ్ముడు

Pinjari Chand
29 ఏప్రిల్, 2026

ఒడిశాలోని కేయోంజర్ జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన దేశవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది. అక్క ఖాతాలో ఉన్న స్వల్ప మొత్తాన్ని పొందడానికి మరణ ధృవీకరణ పత్రం అవసరమని బ్యాంక్ చెప్పడంతో, ఓ గిరిజన వ్యక్తి చివరకు సమాధి నుంచి ఆమె అస్థిపంజరాన్ని తీసుకుని బ్యాంక్‌కు వెళ్లిన ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. ఈ ఘటన బ్యాంకింగ్ విధానాల కఠినత, గ్రామీణ అవగాహన లోపం, మానవతా పరమైన అంశాలపై పెద్ద చర్చకు దారితీసింది.

ఒడిశా రాష్ట్రంలోని కేయోంజర్ జిల్లాలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక గిరిజన వ్యక్తి తన అక్క మరణాన్ని బ్యాంక్‌లో నిరూపించడానికి సమాధి నుంచి అస్థిపంజరాన్ని తవ్వి తీశాడు. గ్రామీణ బ్యాంక్‌కు తీసుకెళుతున్న ఘటన సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. దీంతో దేశ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాం పెల్లుబికింది. అయితే, సంబంధిత బ్యాంక్ అధికారులు తమవైపు నుంచి కేవలం సరైన పత్రాలనే అడిగామని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి సురేశ్ పుజారి ఈ ఘటనలో ‘మానవతా దృక్పథం లోపించింది’ అని వ్యాఖ్యానిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ప్రతిపక్షాలు ఈ ఘటనను ప్రభుత్వ వైఫల్యంగా విమర్శించాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజి కేయోంజర్ నియోజకవర్గానికి చెందినవారని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించాయి. బీజేడీ రాజ్యసభ సభ్యుడు మానస్ రంజన్ మంగరాజ్ ఈ ఘటనను గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థలోని నిర్దయకు నిదర్శనంగా పేర్కొంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. పేదలకు గౌరవం కలిగించేలా బ్యాంకింగ్ విధానాలను సరళీకరించాలని ఆయన కోరారు.

సంఘటన వివరాలు

డయనాలి గ్రామానికి చెందిన జీతూ ముండా (50) తన అక్క కల్రా ముండా (56) ఖాతాలో ఉన్న రూ.19,300 తీసుకోవడానికి మాలిపోసి బ్రాంచ్‌కి పలుమార్లు వెళ్లాడు. మా అక్క చనిపోయిందని చెప్పినా, ఆమెను తీసుకురావాలని బ్యాంక్ వాళ్లు పట్టుబట్టారని జీతూ ముండా తెలిపారు. చివరకు నిరాశతో, కొన్ని రోజుల క్రితం పూడ్చిపెట్టిన తన అక్క సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంక్‌కు తీసుకెళ్లాడు. దాన్ని చూసి షాక్‌కు గురైన బ్యాంక్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జోక్యం చేసుకుని మళ్లీ ఆ అస్థిపంజరాన్ని సమాధిలో పూడ్పించారు. పాట్నా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ కిరణ్ ప్రసాద్ సాహూ మాట్లాడుతూ జీతూ చదువుకోలేదు. లీగల్ హెయిర్, నామినీ వంటి విధానాలు అతనికి తెలియవు. బ్యాంక్ సిబ్బంది సరైన విధంగా వివరించడంలో విఫలమయ్యారని అన్నారు.

చట్టబద్దమైన పత్రాలను మాత్రమే అడిగాం: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

మృతురాలిని తీసుకురావాలని మేము ఎప్పుడూ అడగలేదు. కేవలం మరణ ధృవీకరణ పత్రం వంటి చట్టబద్ధమైన పత్రాలు మాత్రమే కోరాం. సరైన అనుమతి లేకుండా మూడో వ్యక్తికి డబ్బులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో, జీతూ ముండా మద్యం సేవించి అల్లరి చేసిన తర్వాత అస్థిపంజరంతో వచ్చాడని పేర్కొంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకుని రెడ్ క్రాస్ నిధుల నుంచి రూ.30,000 ఆర్థిక సాయం అందించింది. అనంతరం తహసీల్దార్ సమన్వయంతో బ్యాంక్‌లోని డిపాజిట్ మొత్తం వడ్డీతో కలిపి రూ.19,402 జీతూ ముండాకు అందజేశారు.

అయితే, ఈ చర్యల తర్వాత కూడా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యమంత్రి జిల్లా లో ఇలాంటి అమానుష ఘటన జరగడం అసహ్యమని బీజేడీ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ కూడా ఇలాంటి వేధింపులు వెంటనే ఆగాలని డిమాండ్ చేసింది. బ్యాంక్ వర్గాల సమాచారం ప్రకారం, ఖాతాకు నామినీగా ఉన్న మరో అన్న కూడా మృతి చెందడంతో, జీతూ ముండా ఒక్కరే వారసుడిగా మిగిలాడు. అయితే, అతను మరణ ధృవీకరణ పత్రం లేదా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కోసం ముందుగా దరఖాస్తు చేయలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. అదేవిధంగా కల్రా ముండా మరణ ధృవీకరణ పత్రం కోసం ఇప్పటికే దరఖాస్తు సమర్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.