
హైకోర్టు వర్చువల్ విచారణలో కలకలం.. దర్యాప్తు ప్రారంభం
ఢిల్లీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థలో కలకలం రేగింది. ఈ ఘటనపై హైకోర్టు యంత్రాంగం ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై ఐఎఫ్‌ఎస్‌ఓ (ఇంటలిజెన్స్ ప్యూజన్, స్ట్రాటజిక్ ఆపరేషన్స్) విభాగానికి అధికారిక ఫిర్యాదు అందగా, ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన ప్రకారం, కేసు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ఘటనపై సమాచారం అందిందని, వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థలో భద్రతా ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
విచారణలో కలకలం
బుధవారం ప్రధాన న్యాయమూర్తి ఎదుట జరిగిన వర్చువల్ విచారణలో అశ్లీల, అనుచిత కంటెంట్ పదేపదే రావడంతో మూడుసార్లు కోర్టు కార్యకలపాలకు అంతరాయం ఏర్పడింది. ప్రత్యక్షంగా జరుగుతున్న విచారణకు ఇది భంగం కలిగించింది. గుర్తుతెలియని వ్యక్తి ప్లాట్‌ఫారమ్‌పై అభ్యంతరకర వీడియోలను పలుమార్లు ప్లే చేసినట్లు సమాచారం. ఇది అదేపనిగా జరిగిన సైబర్ చొరబాటుకు సంకేతంగా భావిస్తున్నారు. ఒక దశలో సంబంధిత ఖాతాలో ‘మీరు హ్యాక్ చేయబడ్డారు’ అనే సందేశం కనిపించగా, వర్చువల్‌గా పాల్గొన్నవారిలో ఆందోళన నెలకొంది. అలాగే, వ్యవస్థ హ్యాక్ అయిందని సూచించే ఆటోమేటెడ్ ఆడియో సందేశం కూడా వినిపించింది. అయితే, ఈ సందేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దాని నిజస్వరూపం, ఉద్దేశం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.
అనధికార జోక్యం అనుమానం
అధికార వర్గాల సమాచారం ప్రకారం, వర్చువల్ కోర్టు విచారణల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి జోక్యం చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సిస్టమ్ లాగ్‌లు, యాక్సెస్ రికార్డులు, సాంకేతిక లోపాలు తదితర అంశాలను సైబర్ యూనిట్ పరిశీలించనుంది. విచారణలో వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
విచారణ నిలిపివేత
పదేపదే అంతరాయాల కారణంగా విచారణను మూడుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. తరువాత పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేపట్టారు. ఒకే విచారణలో ఈ ఘటన పలుమార్లు జరగడం వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ భద్రత, పటిష్టతపై ఆందోళనలకు దారితీసింది. కోర్టు కార్యకలాపాల సాంకేతిక భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. దర్యాప్తు ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు, బాధ్యులపై స్పష్టత రావాల్సి ఉంది.
