Let's talk: editor@tmv.in
దశాబ్ది పూర్తి చేసుకున్న ‘యూపీఐ’

దశాబ్ది పూర్తి చేసుకున్న ‘యూపీఐ’

Bavana Guntha
2 మే, 2026

భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. దేశంలో సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారుల వరకు నగదు లావాదేవీల సరళిని పూర్తిగా మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విజయవంతంగా దశాబ్దం పూర్తి చేసుకుంది. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించి, భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని యూపీఐ సమూలంగా మార్చివేసింది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో 2016లో ప్రారంభమైన యూపీఐ, స్వల్ప వ్యవధిలోనే అద్భుతమైన వృద్ధిని సాధించింది. ప్రారంభ దశలో 2016-17లో కేవలం 2 కోట్ల లావాదేవీలు మాత్రమే నమోదైనప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ సంఖ్య 24,000 కోట్లకు పైగా పెరగడం యూపీఐ విజయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మొత్తం లావాదేవీల విలువ దాదాపు రూ.314 లక్షల కోట్లకు చేరుకోగా, రోజుకు సగటున 66 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది యూపీఐ ప్రజల రోజువారీ జీవితంలో ఎంతగా కలిసిపోయిందో తెలియజేస్తుంది.

యూపీఐ ద్వారా తక్షణ, అంతర్‌క్రియాత్మక చెల్లింపులు సాధ్యమవుతున్నాయి. గతంలో బ్యాంకుకెళ్లి సమయం వెచ్చించాల్సిన పనులు ఇప్పుడు సెకన్లలోనే పూర్తవుతున్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యయం తగ్గడంతో పాటు, సమయం ఆదా అవుతూ సామాన్యుడికి డిజిటల్ లావాదేవీలు మరింత సులభతరమయ్యాయి.

యూపీఐ కేవలం చెల్లింపుల సాధనం మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషించింది. చిన్న వ్యాపారులు, గ్రామీణ వినియోగదారులను డిజిటల్ పరిధిలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం 700కు పైగా బ్యాంకులు ఈ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమై దేశవ్యాప్తంగా నిరంతర సేవలు అందిస్తున్నాయి. వినియోగ ధోరణులను పరిశీలిస్తే, దాదాపు 86 శాతం వ్యాపార లావాదేవీలు రూ.500 లోపు ఉండటం గమనార్హం. ఇది చిన్నపాటి చిల్లర చెల్లింపుల్లో యూపీఐ ఆధిపత్యాన్ని సూచిస్తోంది.

ప్రపంచ స్థాయిలో భారత్ అగ్రస్థానం

అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం రియల్-టైమ్ పేమెంట్ లావాదేవీల్లో యూపీఐ వాటా 49 శాతం. ఇది డిజిటల్ ఆవిష్కరణల్లో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టింది. రెండో దశాబ్దంలోకి అడుగుపెడుతున్న యూపీఐ, మరింత ఆర్థిక సమ్మిళితత్వాన్నిపెంపొందిస్తూ, దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవనుంది.