Let's talk: editor@tmv.in
యూపీ నేడు అభివృద్ధిలో దూసుకెళుతోంది: ప్రధాని మోడీ
యూపీ నేడు అభివృద్ధిలో దూసుకెళుతోంది: ప్రధాని మోడీ

యూపీ నేడు అభివృద్ధిలో దూసుకెళుతోంది: ప్రధాని మోడీ

Pinjari Chand
30 ఏప్రిల్, 2026

గతంలో గుంతల రహదారులు, అధిక నేరాలు, ‘జంగిల్ రాజ్’కు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం, ఇప్పుడు దేశంలో అత్యధిక ఎక్స్‌ప్రెస్‌వేలు, విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవ సందర్భంగా సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ గుంతల రహదారులకు పేరుగాంచింది. ఇప్పుడు దేశంలో అత్యధిక ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్న రాష్ట్రంగా మారింది. రాష్ట్రంలో 21 విమానాశ్రయాలు ఉన్నాయి, అందులో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలని మోడీ అన్నారు. యూపీ భగవాన్ రాముడు, కృష్ణుడి భూమి అయినప్పటికీ, గత ప్రభుత్వాల పాలనలో నేరాలు, మాఫియా సంస్కృతి పెరిగాయని, ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం నేడు అభివృద్ధిలో దూసుకుపోతుందని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అస్థిరత నెలకొన్నప్పటికీ భారత్ స్థిరంగా అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి బయటి శత్రువులు, అంతర్గతంగా అధికార దాహంతో ఉన్న కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. ఆధునిక మౌలిక వసతుల నిర్మాణంలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే కీలక అడుగని తెలిపారు.

గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం

రూ. 36,230 కోట్ల వ్యయంతో నిర్మితమైన 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ఈ సందర్భంగా ప్రారంభించారు. మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు విస్తరించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే 12 జిల్లాలు, 519 గ్రామాల మీదుగా సాగుతుంది. ఆరు లేన్లతో నిర్మితమైన ఈ మార్గాన్ని భవిష్యత్తులో ఎనిమిది లేన్లకు విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం 11 గంటలు పట్టే ప్రయాణం సుమారు 6 గంటలకు తగ్గనుంది. సుమారు 8 కోట్ల మందికి ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఏఐ ఆధారిత కెమెరా వ్యవస్థలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతను మెరుగుపరుస్తున్నారు. షాజహాన్‌పూర్ జిల్లాలో 3.5 కిలోమీటర్ల పొడవుతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్‌ఎఫ్)ను భారత వాయుసేన కోసం అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టులో సుమారు 80 శాతం పనిని అదానీ ఎంటర్‌‌ప్రైజెస్‌కు చెందిన సంస్థ నిర్వహించగా, మిగతా భాగాన్ని ఐఆర్‌‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ద్వారా సంవత్సరానికి రూ. 25,000 నుంచి 30,000 కోట్ల వరకు లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. వచ్చే దశాబ్దంలో సుమారు 3 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని, రాష్ట్ర జీడీపీకి రూ. 1 లక్ష కోట్ల వరకు తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ఇది పెద్ద ఊతం ఇవ్వనుంది.

మహిళా రిజర్వేషన్‌లకు వారు వ్యతిరేకం

మహిళా రిజర్వేషన్ అంశంపై కూడా మోడీ ఎస్పీ, కాంగ్రెస్‌లను విమర్శించారు. నారీ శక్తి వందన్ సవరణకు వారు వ్యతిరేకంగా ఓటు వేసారని ఆరోపిస్తూ ఈ సవరణ ఆమోదమైతే 2029 నుంచి లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్ లభించేది. కానీ ఎస్పీ దానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. వారు కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాల నుంచి బయటపడలేరని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ‘బిమారు’ రాష్ట్రంగా పిలవబడిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకెళ్తోందని తెలిపారు. రాష్ట్రంలోని యువ శక్తిని వినియోగించి తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న రెండో దశ పోలింగ్‌పై స్పందిస్తూ, అధిక ఓటింగ్ శాతం ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్య పండుగ. ప్రజలు భయంలేకుండా ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, ఐదు రాష్ట్రాల్లో కూడా పార్టీ ‘హ్యాట్రిక్’ విజయాన్ని సాధిస్తుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.

వారణాసిలో 14 కిమీ రోడ్‌షో… కాశీ విశ్వనాథ ఆలయంలో మోడీ పూజలు

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వారణాసి పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం నగరంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షో సుమారు 14 కిలోమీటర్ల మేర సాగి, మార్గమంతా భారీగా జనసందోహం కనిపించింది. ఈ రోడ్‌షో బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ వద్ద ప్రారంభమై లహర్తారా, కచహ్రీ, అంబేడ్కర్ చౌరాహా, చౌకఘాట్, టేలియాబాగ్, లహురాబీర్, మైదాగిన్ ప్రాంతాల మీదుగా సాగి, చివరకు కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ వద్ద ముగిసింది. ఆలయానికి చేరుకున్న తర్వాత మోడీ వేద మంత్రాల మధ్య పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు త్రిశూలం, డమరు, సంప్రదాయ అంగవస్త్రం అందజేసి సత్కరించారు. ఆలయం నుంచి బయటకు వచ్చినప్పుడు భక్తులు ‘హర్ హర్ మహాదేవ్’, ‘జై శ్రీరామ్’ నినాదాలతో స్వాగతం పలికారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌లో పిల్లలతో కూడా కాసేపు మాట్లాడారు. నగర చరిత్రలోనే ఇది అతి పెద్ద రోడ్‌షోలలో ఒకటిగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మార్గమంతా ఇరువైపులా భారీగా ప్రజలు గుమికూడినట్లు అధికారులు తెలిపారు.