Let's talk: editor@tmv.in
యూనివర్సిటీలు పరిశోధన కేంద్రాలుగా మారాలి:ఏపీ సీఎం

యూనివర్సిటీలు పరిశోధన కేంద్రాలుగా మారాలి:ఏపీ సీఎం

Panthagani Anusha
2 మే, 2026

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాంది పలికారు. గురువారం సచివాలయంలో పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కేవలం పట్టాలు ఇచ్చే కేంద్రాలుగా మిగిలిపోకుండా ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు చిరునామాలుగా మారాలని ఆకాంక్షించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా కోర్సులు

భవిష్యత్తులో రాబోయే పారిశ్రామిక మార్పులను ముందే అంచనా వేసి దానికి అనుగుణంగా కోర్సులను రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. ముఖ్యంగా లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, క్వాంటం టెక్నాలజీ వంటి ‘గేమ్ ఛేంజర్’ రంగాలలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చారు. క్వాంటం టెక్నాలజీలో కోర్సును ప్రారంభించిన ఆంధ్రా యూనివర్సిటీని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

ప్రపంచ స్థాయి వర్సిటీలతో భాగస్వామ్యం

రాష్ట్రంలోని యూనివర్సిటీలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలని ఇందుకోసం ప్రపంచంలోని టాప్ 200 విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రతి విశ్వవిద్యాలయం కనీసం ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థతో అనుసంధానమై ఉండాలని తద్వారా విద్యార్థులకు క్షేత్రస్థాయిలో నైపుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా గ్లోబల్ అవకాశాల కోసం విద్యార్థులకు జర్మన్ వంటి విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ

రాష్ట్ర యువతకు అత్యుత్తమ నైపుణ్యాలను అందించి రాబోయే కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం 'ర్యాండమ్ స్కిల్ ఆడిట్' నిర్వహించి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉన్న 'స్కిల్ గ్యాప్'ను భర్తీ చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల ద్వారా కల్పించే ఉద్యోగ సమాచారాన్ని ఒకే చోట చేర్చి సమీకృత పోర్టల్ ద్వారా పారదర్శకంగా వెల్లడించాలని అధికారులను కోరారు.

స్కూల్ లెవెల్ నుంచే సాంకేతికత - 'స్టూడెంట్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్'

విద్యార్థులలో సృజనాత్మకతను పెంచేందుకు త్వరలోనే స్టూడెంట్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ పేరుతో ఏఐ సదస్సును నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూ మార్పు డిజిటల్ బోర్డుల ద్వారా బోధన, తల్లిదండ్రుల కోసం లీప్ యాప్ వంటి సాంకేతిక మార్పులను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పాఠ్యాంశాల మార్పు కోసం ఐఐటీ చెన్నై వంటి ప్రతిష్టాత్మక సంస్థల సిఫార్సులను తీసుకోవాలని పేర్కొన్నారు.

విప్లవాత్మక సంస్కరణలే ధ్యేయం: మంత్రి లోకేష్

పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కోర్సులను రీస్ట్రక్చర్ చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా వివరించారు. ఎన్సీఈఆర్టీ సహకారంతో పాఠ్యాంశాలను మారుస్తున్నామని ఉపాధ్యాయులకు ఫిన్లాండ్ వంటి దేశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ‘టీచర్-స్టూడెంట్-అవుట్‌కమ్’ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను విద్యా రంగంలో అగ్రగామిగా నిలుపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమీక్షకు పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.