
అనంతవరప్పాడు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి, ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామ ప్రజల 17 సంవత్సరాల సుదీర్ఘ రోడ్డు నిర్మాణ కల ఎట్టకేలకు సాకారమైంది. అనంతవరప్పాడు గ్రామం నుంచి నేషనల్ హైవే 16 వరకు రూ. 6.7 కోట్ల ఏపీసీఆర్‌డీఏ నిధులతో నిర్మించనున్న సరికొత్త బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పురోగతికి రహదారులు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత స్థానిక ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించే అద్భుతమైన అవకాశం కలుగుతుందన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని, ఈ రోడ్డు నిర్మాణం స్థానిక ప్రాంత అభివృద్ధికి మరొక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
