
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వల మాయంపై వెలువడుతున్న మీడియా కథనాల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సింగరేణి సంస్థకు చెందిన దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు, సుమారు రూ.1,600 కోట్ల విలువైన నిల్వలు మాయమైనట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఈ అంశంపై అత్యవసరంగా సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.51,500 కోట్లకు పైగా బకాయిల కారణంగా సింగరేణి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ స్థాయిలో బొగ్గు నిల్వలు అదృశ్యమయ్యాయన్న ఆరోపణలు సంస్థ ప్రతిష్ఠకు, ఆర్థిక స్థితికి మరింత నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గనులు, బొగ్గు నిల్వల భద్రతను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. 40 వేల మందికి పైగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం, అలాగే ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ భవిష్యత్తును కాపాడటం అందరి బాధ్యత అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
