Let's talk: editor@tmv.in
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బ‌హిరంగ‌ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బ‌హిరంగ‌ లేఖ

Gaddamidi Naveen
29 ఏప్రిల్, 2026

సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లకు వెళ్లే అప్రోచ్ రోడ్ల విస్తరణ పనులను తక్షణమే చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల‌ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ముఖ్యమంత్రికి బ‌హిరంగ లేఖ రాశారు.

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై పెరుగుతున్న ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించడానికి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను రూ.430 కోట్లతో అభివృద్ధి చేసినట్లు కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఇక్కడి నుంచి అనేక రైళ్లు, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, అయితే స్టేషన్‌కు వెళ్లే దారులు ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. చర్లపల్లిలో పార్కింగ్, ఇతర ప్రయాణికుల వసతుల కల్పన కోసం తక్షణమే భూసేకరణ చేపట్టాలని కోరారు.

ఎఫ్సీఐ గోడౌన్ రోడ్డు నుంచి స్టేషన్ వరకు రహదారిని 200 అడుగులకు విస్తరించాలని, భరత్ నగర్ వైపు ఉన్న 30 అడుగుల రోడ్డును 100 అడుగులకు పెంచాలని సూచించారు. అలాగే ఈసీ నగర్ నుంచి ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాం వైపు రోడ్డును 100 అడుగుల వెడల్పుతో, 700 మీటర్ల పొడవున విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. పార్కింగ్, ఇతర అవసరాల కోసం కొత్త భవనం వైపు 3 ఎకరాలు, ఎంఎంటీఎస్ వైపు 2.70 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.715 కోట్లతో అత్యంత భారీ స్థాయిలో పునరుద్ధరిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇంత భారీ ప్రాజెక్టు జరుగుతున్న సమయంలో, స్టేషన్ ముందు ఉన్న రహదారిని కూడా విస్తరిస్తేనే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఆయన సూచించారు. గతంలో ఇదే అంశంపై తాను రేవంత్ రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖలు రాసినప్పటికీ, పనులు ఇంకా ప్రారంభం కాలేదని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ రోడ్ల విస్తరణను త్వరగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.