Let's talk: editor@tmv.in
మెట్రో ఫేజ్-2ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: వి. హనుమంతరావు

మెట్రో ఫేజ్-2ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: వి. హనుమంతరావు

Gaddamidi Naveen
17 జూన్, 2026

మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కావాలనే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు (వీహెచ్) తీవ్రస్థాయిలో ఆరోపించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న బీజేపీ, కిషన్ రెడ్డిల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రగతికి అడ్డుపడకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కేంద్ర మంత్రికి హితవు పలికారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలను వీహెచ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలోని ఇతర నగరాలైన విశాఖపట్నం, అహ్మదాబాద్‌లలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తోందని.. మరి తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అడ్డుపడుతోందని ఆయన ప్రశ్నించారు.

కావాలనే నిధుల నిలిపివేత

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణను కేంద్రం ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందని వీహెచ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మీరెందుకు అడ్డుకుంటున్నారు? కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన బాధ్యత, ఇక్కడి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాల్సిన కనీస కర్తవ్యం ఆయనపై ఉందని వీహెచ్ స్పష్టం చేశారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను త్వరగా ముందుకు తీసుకెళ్లేలా కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణపై తెలంగాణ ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న తరుణంలో వీహెచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మెట్రో విస్తరణ కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి అత్యంత తక్కువ వడ్డీకి మంజూరైన రూ. 13,600 కోట్ల రుణాన్ని కిషన్ రెడ్డి కావాలనే నిలిపివేయించారని సోమ‌వారం సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. రాజకీయ స్వార్థంతోనే ఈ నిధులను ఆపారని, ఈ ఫండింగ్‌ను నిలిపివేయడం వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభావం కూడా ఉందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ నగర రవాణా రంగానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టుపై కేంద్రం తన వివక్షను వీడాలని వీహెచ్ డిమాండ్ చేశారు.