
సైబర్ నేరాలపై సీపీ సజ్జనార్‌తో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్
టెలికాం మౌలిక సదుపాయాలను దుర్వినియోగం చేస్తూ సాగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన వ్యవస్థాగత చర్యలపై కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ విషయాన్ని సీపీ సజ్జనార్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.
పౌరులను సైబర్ నేరాల నుంచి రక్షించడానికి ఇంటెలిజెన్స్ ఆధారిత అమలు, వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం, పకడ్బందీ నివారణా చర్యలు ఎంత ముఖ్యమనే అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించామని సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
టెలికాం అధికారులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (పోలీస్) సంస్థల మధ్య సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, నేరాలకు ఆస్కారం లేకుండా టెలికాం మౌలిక వసతుల దుర్వినియోగాన్ని మూలాల్లోనే అడ్డుకునేలా బలమైన నియంత్రణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇటీవల టెలికాం మౌలిక సదుపాయాలను వాడుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై తీసుకున్న చర్యల అనంతరం, మంత్రి టెలికాం శాఖ హైదరాబాద్ పోలీసులతో ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సాంకేతిక వ్యవస్థలు ప్రజలకు రక్షణ కల్పించేవిగా ఉండాలి తప్ప, నేరాలకు మార్గాలుగా మారకూడదని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. దేశంలో సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయడానికి, ప్రజా విశ్వాసాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
