Let's talk: editor@tmv.in
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలి: కేటీఆర్

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలి: కేటీఆర్

Gaddamidi Naveen
18 మే, 2026

పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ అరెస్టు కావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగితే ఈ కేసులో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరగడం సాధ్యం కాదని, అందువల్ల ఆయనను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ హైకోర్టు భగీరథ్‌కు ముందస్తు అరెస్ట్ నుంచి ఎలాంటి మధ్యంతర రక్షణ కల్పించడానికి నిరాకరించిన మరుసటి రోజే (శనివారం రాత్రి) పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ భగీరథ్‌కు జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్) విధించారు.

రాజకీయ నినాదాలకే పరిమితమా?

ఎల్బీనగర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచుగా “బేటీ బచావో, బేటీ పఢావో” అని గొప్పగా చెబుతుంటారని, అయితే ఇలాంటి నినాదాలు కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితమైతే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే బహుశా మొదటిసారిగా ఒక కేంద్ర మంత్రి కుమారుడిపై లుకౌట్ నోటీస్ జారీ చేసే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ బండి సంజయ్‌ను మంత్రివర్గంలో కొనసాగించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఆయనను వెంటనే బర్తరఫ్‌ చేయాలని, అప్పుడే దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి ఉంటుంది. విచారణ సక్రమంగా ముందుకు సాగదు అని కేటీఆర్ ఆరోపించారు.

తొమ్మిది రోజులు రక్షించింది ఎవరు?

ఈ కేసు నమోదైన తర్వాత నిందితుడు దాదాపు తొమ్మిది రోజుల పాటు ఎలా పరారీలో ఉండగలిగాడని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కాలంలో అతనికి ఆశ్రయం కల్పించి, కాపాడింది ఎవరనే కోణంలో కూడా విచారణ జరగాలన్నారు. సున్నితమైన కేసులలో తమ అధికార బలంతో ప్రభావం చూపే అవకాశం ఉన్న వ్యక్తులు ఇలాంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగడం ఒక్క తెలంగాణకే కాకుండా, యావత్ దేశానికే అవమానకరమని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కుమారుడు ఒక మైనర్ బాలికకు అన్యాయం చేస్తే, సదరు బాధితురాలి తల్లిదండ్రులను స్వయంగా కేంద్ర మంత్రే బెదిరింపులకు గురిచేసి, ఒత్తిడి తెచ్చారని కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా ఈ కేసు యొక్క తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఈ కేసులో న్యాయం కోసం బీఆర్‌ఎస్ మహిళా నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారని కేటీఆర్ తెలిపారు. పార్టీ మహిళా విభాగం నాయకులు, విద్యార్థి సంఘాలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు చేసిన పోరాటాన్ని ఆయన అభినందించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మళ్లీ గులాబీ జెండా ఎగరాల్సిందే

ఇదిలా ఉండగా, తెలంగాణ, హైదరాబాద్ భవిష్యత్తు బాగుపడాలంటే మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. పదేళ్ల తమ పాలనలో కులం, మతం పేరిట ఎన్నడూ చిల్లర రాజకీయాలు చేయలేదని, గంగా-జమునా తెహజీబ్ సంస్కృతిలా అందరినీ సమానంగా ఆదరించామని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమాలను జోడెద్దుల మాదిరిగా ముందుకు నడిపించామని పేర్కొన్నారు.

ప్రస్తుతం సమాజంలో విద్వేషాలు రగిలిస్తూ కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలను మనమంతా ఏకమై తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం ఈసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత, ప్రతి బూత్ లెవెల్ కమిటీకి ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని కేటీఆర్ వివరించారు.