
మీడియా సంస్థలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.కోటి పరువు నష్టం దావా
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ కోర్టులో సంచలన సివిల్ దావా దాఖలు చేశారు. తన కుమారుడు బండి సాయి భగీరథ్‌కు సంబంధించిన కేసును పురస్కరించుకుని, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూర్వక ప్రచారం సాగిస్తున్నారంటూ పలు ప్రముఖ తెలుగు వార్తా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా మొత్తం 23 మంది ప్రతివాదులపై ఆయన రూ. 1 కోటి నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తనకు లభించిన గౌరవంగా జీవించే హక్కును కాపాడాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
ఈ కేసులో ఏ ఎఫ్‌ఐఆర్ లోనూ తన పేరు నిందితుడిగా లేకపోయినప్పటికీ, మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు, తప్పుదోవ పట్టించే వార్తలను ప్రసారం చేశాయని బండి సంజయ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కుమారుడికి పరిచయం ఉన్న ఒక మైనర్ బాలిక కుటుంబం బ్లాక్‌మెయిల్ చేయడంతో, మొదట తన కుమారుడే కరీంనగర్‌లో క్రిమినల్ ఫిర్యాదు చేశాడని తెలిపారు. దానికి ప్రతిగా అవతలి పక్షం వారు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో తన కుమారుడిని ఏ-1గా మారుస్తూ భరతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టాల కింద కౌంటర్ కేసు పెట్టారని వివరించారు.
రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు..
నిందితుడికి తండ్రిని కావడం మినహా ఈ ఘటనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను దర్యాప్తును ప్రభావితం చేసినట్లు గానీ, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గానీ ఎలాంటి ఆరోపణలు లేవని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఛానళ్లు సంచలన హెడ్‌లైన్లు, తప్పుడు థంబ్‌నైల్స్, మార్ఫింగ్ పోస్టులతో సమన్వయంతో కూడిన దుష్ప్రచారాన్ని నడిపాయని ఆరోపించారు. దీనివల్ల తనకు తీవ్ర మానసిక క్షోభ, రాజకీయ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆయా వివాదాస్పద కంటెంట్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని, భవిష్యత్తులో తనపై ఇలాంటి వార్తలు వేయకుండా శాశ్వత నిషేధాజ్ఞలు జారీ చేయాలని కోరారు.
భగీరథ్ పోలీస్ కస్టడీపై నేడు తీర్పు
మరోవైపు, ఈ పోక్సో కేసులో ఇప్పటికే మే 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న బండి సాయి భగీరథ్‌ను విచారించేందుకు మూడు రోజుల పోలీస్ కస్టడీ ఇవ్వాలని పేట్‌బషీరాబాద్ పోలీసులు కోర్టును కోరారు. భగీరథ్ తరఫు న్యాయవాది దీనిని వ్యతిరేకిస్తూ.. ఒకవేళ కస్టడీ ఇస్తే విచారణ సమయాన్ని పరిమితం చేయాలని, వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన తీర్పును మే 26కు వాయిదా వేసింది.
