Let's talk: editor@tmv.in
రాజమండ్రి-విశాఖ రైల్వే లైన్ల విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రాజమండ్రి-విశాఖ రైల్వే లైన్ల విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Panthagani Anusha
19 ఏప్రిల్, 2026

దేశంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో సుమారు రూ.24,815 కోట్ల అంచనా వ్యయంతో రెండు భారీ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తూ సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు.

ఏపీకి రూ.9,889 కోట్ల కేటాయింపు

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత రద్దీగా ఉండే రాజమండ్రి (నిడదవోలు) – విశాఖపట్నం (దువ్వాడ) సెక్షన్‌లో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. 198 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టుకు రూ.9,889 కోట్లు ఖర్చు చేయనున్నారు. హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో ఉన్న ఈ సెక్షన్ ప్రస్తుతం 130 శాతం వినియోగంతో తీవ్ర రద్దీని ఎదుర్కొంటోంది. కొత్త లైన్ల నిర్మాణంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా రాజమండ్రి వద్ద గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల పొడవైన భారీ రైల్వే వంతెనను, 2.67 కి.మీ. వైడక్ట్‌ను నిర్మించనున్నారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల మీదుగా సాగే ఈ మార్గం ద్వారా ఏటా 29.04 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సాధ్యమవుతుందని అధికారులు వెల్లడించారు.

యూపీలో రూ.14,926 కోట్లతో విస్తరణ

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ – సీతాపూర్ మధ్య 403 కిలోమీటర్ల మేర 3వ, 4వ లైన్ల నిర్మాణానికి రూ.14,926 కోట్లు కేటాయించారు. ఢిల్లీ-గువాహటి మార్గంలో అత్యంత కీలకమైన ఈ సెక్షన్ ప్రస్తుతం 168 శాతం వినియోగంతో నడుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏటా 35.72 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణాకు అవకాశం లభిస్తుంది. ఇది రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

పర్యాటకానికి ఊతం.. భారీగా ఉపాధి

పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీకి ప్రాధాన్యతనిస్తున్నాయి. వీటి వల్ల పర్యాటక రంగం కూడా పుంజుకోనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం వంటి పుణ్యక్షేత్రాలకు, యూపీలోని నైమిశారణ్యం, గంగా ఘాట్ వంటి ప్రాంతాలకు రైల్వే సౌకర్యం మరింత మెరుగుపడనుంది.

పర్యావరణ హితం.. తక్కువ లాజిస్టిక్స్ ఖర్చు

రైల్వే లైన్ల సామర్థ్యం పెరగడం వల్ల ప్రయాణికులకు రద్దీ సమస్యలు తప్పడమే కాకుండా సరుకు రవాణా వేగవంతం కానుంది. దీనివల్ల లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కలిపి 180 కోట్ల కిలోలకు పైగా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని తద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా మేలు జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

రాజమండ్రి-విశాఖ రైల్వే లైన్ల విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ - Tholi Paluku