
జూన్ 15 లోపు యూనిఫాంలు, పుస్తకాలు పంపిణీ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే, అంటే జూన్ 15 నాటికి పూర్తిస్థాయిలో అన్ని రకాల విద్యా సామాగ్రిని సకాలంలో అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో విద్యా సామాగ్రి కేంద్రీకృత కొనుగోలు విధానంపై ఆయన చర్చించారు.
గతంలో విద్యాశాఖతో పాటు బీసీ, మైనారిటీ, ఎస్టీ, ఎస్సీ సంక్షేమ శాఖలు స్వతంత్రంగా కొనుగోళ్లు జరిపేవి. దీనివల్ల వస్తువుల నాణ్యతలో ఏకరూపత లేకపోవడమే కాకుండా, యూనిఫాంలు, నోటు పుస్తకాలు సరఫరాలో అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఎం పేర్కొన్నారు. ఈ అక్రమాలను అరికట్టేందుకే ప్రభుత్వం కేంద్రీకృత విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆయన వివరించారు. ప్రభుత్వ లక్ష్యం విద్యార్థుల ప్రయోజనం చేకూర్చడమే కానీ, సరఫరాదారుల లాభాల కోసం కాదు అని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకాలు, యూనిఫాంలు, ట్రాక్ సూట్లు, స్కూల్ బ్యాగులు, ట్రంక్ పెట్టెలు, బెడ్ షీట్లు, ప్లేట్లు, గ్లాసులు వంటి వస్తువులన్నీ అత్యంత నాణ్యతతో ఉండాలని సీఎం సూచించారు. పంపిణీ ప్రక్రియ పర్యవేక్షణ కోసం ప్రతి మండలంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని, గ్రామ స్థాయిలో పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా సమర్థంగా జరిగేలా చూడాలని చెప్పారు. పంపిణీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సేకరించి ప్రతి విద్యార్థికి అవసరమైన సామగ్రి అందిందో లేదో నిర్ధారించాలని ఆదేశించారు. అలాగే నాణ్యతపై విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సూచించారు.
సామగ్రి పంపిణీ పూర్తికాగానే సరఫరాదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని సీఎం అధికారులకు సూచించారు. సకాలంలో వస్తువులు అందితేనే విద్యార్థులు చదువుపై పూర్తి శ్రద్ధ చూపగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
