Let's talk: editor@tmv.in
ఊహించని విషాదం: ఉదయ్‌పూర్‌లో ఘోర ప్రమాదం

ఊహించని విషాదం: ఉదయ్‌పూర్‌లో ఘోర ప్రమాదం

Dantu Vijaya Lakshmi Prasanna
7 మే, 2026

ప్రముఖ చిత్ర నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్ బీ చౌదరి మరణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జోథ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ బి చౌదరి మరణించడం బాధాకరమన్నారు. రాజస్థాన్‌లో ఒక బంధువు పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా, ఉదయ్‌పూర్ సమీపంలోని జూంతా గ్రామ పరిధిలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై అకస్మాత్తుగా పశువులు అడ్డు రావడంతో కారు నియంత్రణ కోల్పోయి గోడను బలంగా ఢీకొట్టిందని సమాచారం. ఈ ప్రమాదంలో చౌదరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 90కి పైగా చిత్రాలను నిర్మించిన చౌదరి ఎంతో మంది నటీనటులకు అవకాశాలను అందించారని ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్ బీ చౌదరి మరణం చిత్రసీమకు తీరని లోటన్నారు. ఆర్ బీ చౌదరి ఆత్మకు శాంతి కలగాలని సీఎం ప్రార్ధించారు. చౌదరి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా వెలుగొందిన ఆర్. బీ . చౌదరి (76) మరణించిన తీరు అత్యంత విషాదకరం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. "ఉదయ్‌పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో చౌదరి దుర్మరణం చెందారనే దుర్వార్తను నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

'సుస్వాగతం' మధుర జ్ఞాపకాలు

పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో ఆయనకు ఒక భారీ విజయాన్ని అందించిన నిర్మాత ఆర్.బీ . చౌదరి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సుస్వాగతం' (1998) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, పవన్ కళ్యాణ్‌ను మాస్, క్లాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. "నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్నిఆర్.బీ . చౌదరి నిర్మించారు. ఆ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం, సాధించిన విజయం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది" అని పవన్ గుర్తుచేసుకున్నారు. కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా, కళాత్మక విలువలతో కూడిన సినిమాలను నిర్మించడంలో చౌదరికి సాటిలేరని ఆయన కొనియాడారు.

సిస్టర్ సెంటిమెంట్.. 'అన్నవరం' అనుబంధం

ఆర్.బీ . చౌదరికి కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా మంచి పేరుంది. పవన్ కళ్యాణ్‌తో ఆయన చేసిన రెండో సినిమా 'అన్నవరం'. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తిరుపాచ్చి'కి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని కూడా చౌదరి నిర్మించారు. ఈ సినిమాలో అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. "అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను, చక్కటి సంగీతం ఉండేలా ఆయన ప్లాన్ చేసేవారు" అని పవన్ పేర్కొన్నారు.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 99 చిత్రాలను నిర్మించిన ఘనత ఆర్.బీ . చౌదరిది. సినిమా రంగంపై, చిత్ర నిర్మాణ వ్యాపారంపై ఆయనకు ఉన్న పట్టును పవన్ కళ్యాణ్ అభినందించారు. "చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపార వ్యవహారాలపై ఆయనకు ఉన్న సాధికారత అమోఘం. అటు తెలుగు, ఇటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ఆయన ఒక ప్రత్యేక స్థానాన్ని, గౌరవాన్ని సంపాదించుకున్నారు" అని పవన్ అన్నారు. కొత్త దర్శకులను పరిచయం చేయడంలో, ప్రతిభ ఉన్న నటులను ప్రోత్సహించడంలో ఆర్.బీ .చౌదరి ఎప్పుడూ ముందుండేవారని సినీ వర్గాలు చెబుతుంటాయని అన్నారు.

ఆర్.బీ. చౌదరి మరణం కేవలం ఒక నిర్మాత కోల్పోవడం మాత్రమే కాదు, చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కాగా చౌదరి కుమారులు జీవా, జితన్ రమేష్ కూడా నటులుగా రాణిస్తున్నారు. వారి కుటుంబం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ తీరని లోటు పట్ల పవన్ తన సానుభూతిని వ్యక్తం చేశారు. "ఆర్.బీ . చౌదరిఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఆర్.బీ .చౌదరి అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి, ఆయనకు నివాళులు అర్పించేందుకు చిత్ర ప్రముఖులు తరలివెళ్తున్నారు.