Let's talk: editor@tmv.in
ఉబెర్ కప్: భారత మహిళల పోరాటం ముగిసె

ఉబెర్ కప్: భారత మహిళల పోరాటం ముగిసె

Shaik Mohammad Shaffee
29 ఏప్రిల్, 2026

ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల జట్టు ప్రస్థానం నిరాశాజనకంగా ముగిసింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం జరిగిన గ్రూప్-ఏ చివరి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా ధాటికి భారత్ కకావికలమైంది. స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, కీలక సమయంలో పట్టు కోల్పోవడంతో భారత్ 0-5 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఓటమితో టోర్నీలో భారత మహిళల ప్రయాణం ముగిసినట్లయింది.

గెలుపు ముంగిట బోల్తా పడ్డ సింధు

తొలి సింగిల్స్‌లో పీవీ సింధు, ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జియీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు, రెండో గేమ్‌లో పుంజుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు చేర్చింది. మూడో గేమ్‌లో ఒక దశలో 18-12తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న సింధు విజయం ఖాయమనిపించింది. అయితే అనూహ్యంగా లయ తప్పిన ఆమె, వరుసగా పాయింట్లు సమర్పించుకుని 16-21, 21-19, 19-21తో ఓటమిపాలైంది.

చేతులెత్తేసిన యువ షట్లర్లు

సింధు ఓటమితో ఒత్తిడిలో పడ్డ భారత్‌ను యువ క్రీడాకారిణులు గట్టెక్కించలేకపోయారు. డబుల్స్‌లో ప్రియా కొంజెంగ్‌బామ్-శ్రుతి మిశ్రా జోడీ ప్రపంచ నంబర్ వన్ జంట చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండో సింగిల్స్‌లో ఇషారాణి బారువా, ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యుఫీకి గట్టి పోటీ ఇచ్చి 20-22, 13-21తో ఓడింది. ఆ తర్వాత జరిగిన రెండో డబుల్స్‌లో ట్రీసా జాలీ-కావిప్రియ జంట, చివరి సింగిల్స్‌లో దేవిక సిహాగ్ కూడా ఓడిపోవడంతో భారత్ పూర్తిస్థాయిలో పరాజయం పాలైంది.

నేడు చైనాతో పురుషుల అమీతుమీ

మహిళల జట్టు నిరాశపరిచినప్పటికీ, పురుషుల జట్టు థామస్ కప్‌లో జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన భారత పురుషుల జట్టు, గ్రూప్ టాపర్‌ను తేల్చే కీలక పోరులో నేడు బలమైన చైనాను ఢీకొనబోతోంది. 2022 ఛాంపియన్ల హోదాలో ఉన్న భారత్, మహిళల ఓటమికి నేటి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.