Let's talk: editor@tmv.in
కూటమి రెండేళ్ల పాలన ప్రజా విశ్వాసానికి నిదర్శనం: సీఎం చంద్రబాబు

కూటమి రెండేళ్ల పాలన ప్రజా విశ్వాసానికి నిదర్శనం: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
14 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు. తిరుపతి సమీపంలోని దామినిడు గ్రామంలో జరిగిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు, కూటమి శ్రేణులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ దిశగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని పేర్కొన్నారు. తన నాయకత్వంపై అపారమైన విశ్వాసం ఉంచిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని టీడీపీ అధినేత స్పష్టం చేశారు.

గడిచిన రెండేళ్ల కాలంలో గత ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించడానికి తాము వేసిన ప్రతి అడుగు ఒక మైలురాయిగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాబోయే రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి పునరంకితం అవుతానని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ప్రతిజ్ఞ చేశారు.