
వరంగల్‌లో రెండు ‘రెడ్ శాండ్ బోవా’ పాములు స్వాధీనం.. నిందితుడి అరెస్ట్
వరంగల్ జిల్లాలో అత్యంత అరుదైన, రక్షిత జీవుల జాబితాలో ఉన్న రెండు సజీవ ‘రెడ్ శాండ్ బోవా’ (ఎర్ర మట్టి పాములు) ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సోమవారం పట్టుకున్నారు.
వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడుతూ, ఈ పాములను గ్రే మార్కెట్‌లో భారీ ధరలకు విక్రయించడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడనే పక్కా సమాచారంతో డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు మే 17న మారువేషంలో రంగంలోకి దిగారు. అనుమానాస్పదంగా బ్యాగుతో వెళ్తున్న నిందితుడిని గుర్తించి అడ్డుకున్నారు. ఆ బ్యాగును తనిఖీ చేయగా.. అందులో రెండు సజీవ ఇండియన్ రెడ్ శాండ్ బోవా పాములు లభ్యమయ్యాయని డీఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇండియన్ రెడ్ శాండ్ బోవా అనేది వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972లోని షెడ్యూల్-1 కింద చేర్చబడింది. ఈ రకమైన పాములను కలిగి ఉండటం లేదా విక్రయించడం చట్టప్రకారం పూర్తిగా నేరం. స్వాధీనం చేసుకున్న రెండు రెడ్ శాండ్ బోవా పాములను, వాటిని ప్యాక్ చేసిన సామాగ్రిని, పట్టుబడిన నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం వరంగల్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు (అటవీ శాఖ) డీఆర్ఐ అధికారులు అప్పగించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
