Let's talk: editor@tmv.in
ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్‌లో రెండు విమానాలు ఢీ.. డీజీసీఏ దర్యాప్తు

ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్‌లో రెండు విమానాలు ఢీ.. డీజీసీఏ దర్యాప్తు

Pinjari Chand
17 ఏప్రిల్, 2026

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్‌‌నేషనల్‌ ఎయిర్‌‌పోర్ట్‌లో గురువారం మధ్యాహ్నం రెండు విమానాలు ఒకదానితో ఒకటి తాకి దెబ్బతిన్న ఘటన జరిగింది. ఈ ఘటనపై డైరేక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించింది. అధికారుల సమాచారం ప్రకారం, ఆకాశ ఎయిర్‌‌, స్పైస్‌ జెట్‌కు చెందిన రెండు బోయింగ్‌ 737 విమానాలు ఢిల్లీ విమానాశ్రయంలో టాక్సీవే వద్ద ఒకదానితో ఒకటి తాక్కున్నాయి. ఈ ఘటన తర్వాత రెండు విమానాలను కూడా గ్రౌండ్‌ చేశారు. మధ్యాహ్నం 2.15 గంటలకు టర్మినల్-1 వద్ద ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో ఆకాశ ఎయిర్‌కు చెందిన విమానం టాక్సీవేపై నిలిచివుండగా, స్పైస్‌జెట్‌ విమానం పార్కింగ్‌ బే వైపు టాక్సీ అవుతోంది.

ఆకాశ ఎయిర్‌ విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన క్యూపీ-1406 ఫ్లైట్ కాగా, స్పైస్‌జెట్‌ విమానం లేహ్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎస్‌జీ-124 ఫ్లైట్ అని అధికారులు తెలిపారు. డీజీసీఏ ప్రకటన ప్రకారం, స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737-700 విమానం కుడి వైపు వింగ్‌లెట్‌ ఆకాశఎయిర్‌ విమానం హారిజాంటల్ టెయిల్ సర్ఫేస్‌ను తాకింది. ఈ ప్రభావంతో స్పైస్‌జెట్ విమానం కుడి వింగ్‌లెట్‌, ఆకాశ విమానం వెనుక భాగం దెబ్బతిన్నాయి. ఆకాశ ఎయిర్‌ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ-హైదరాబాద్‌ క్యూపీ-1406 ఫ్లైట్ కోసం సిద్ధంగా ఉన్న తమ బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 విమానం బేకు తిరిగి తీసుకువచ్చారు. అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా దింపినట్లు కంపెనీ తెలిపింది. స్పైస్‌జెట్‌ కూడా తమ విమానం టాక్సీ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, కుడి వింగ్‌లెట్‌ దెబ్బతిన్నందున విమానాన్ని గ్రౌండ్‌ చేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే రెండు విమానాల రెక్కలు ఒకదానితో ఒకటి తాకినట్లు ప్రాథమిక సమాచారం ఉందని అధికారులు తెలిపారు. రెండు విమానాల్లో ఉన్న ప్రయాణికుల సంఖ్యపై మాత్రం వివరాలు ఇంకా తెలియరాలేదు.