
గండిపేట భూ స్కాంలో మరో ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ శివారులోని గండిపేట పరిధిలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను నకిలీ జీవోలు, ఫోర్జరీ పత్రాల ద్వారా హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించిన భారీ భూ కుంభకోణాన్ని సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ అంతరాష్ట్ర ల్యాండ్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వి. రాధాకృష్ణ (53) తో పాటు అతనికి ఆశ్రయం కల్పించి దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిన అతని వ్యక్తిగత డ్రైవర్‌ను నార్సింగి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు నిందితులు జైలులో ఉండగా తాజాగా ప్రధాన నిందితుడి అరెస్ట్‌తో ఈ ముఠా వెనుక ఉన్న కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీల నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది.
పాత నేరస్తుడి ‘మెగా స్కెచ్’
పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు రాధాకృష్ణకు పాత నేరచరిత్ర ఉంది. గతంలో సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురిని ముంచిన కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. మోసం, ఫోర్జరీ, నమ్మకద్రోహం వంటి పలు క్రిమినల్ సెక్షన్ల కింద ఇప్పటికే ఇతనిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే సులభంగా వందల కోట్లు సంపాదించాలనే దురాశతో గండిపేట ప్రాంతంలోని వివాదాస్పద, ప్రభుత్వ భూములపై కన్నేశాడు. ఆయా భూములపై హక్కులు ఉన్నాయని నమ్మబలికే స్థానిక దళారులతో చేతులు కలిపి ఒక క్రమపద్ధతిలో ఈ భూ కుంభకోణానికి వ్యూహరచన చేశాడు.
మాజీ ఎమ్మెల్యేతో రూ.12 కోట్ల డీల్..
సదరు భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందినదని దానిపై ఎలాంటి చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కల్పించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ నిందితులు వెనక్కి తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మాజీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అతని సోదరుడిని ఈ భూమి కొనుగోలు వైపు ఆకర్షించారు. సదరు ప్రభుత్వ భూమికి క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్), వారసత్వ హక్కులు కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొస్తామని క్లియర్ టైటిల్‌తో భూమిని అప్పగిస్తామని నమ్మబలికారు. ఈ నమ్మకంతో సదరు మాజీ ఎమ్మెల్యే గ్రూప్ నుంచి విడతల వారీగా దాదాపు రూ.12 కోట్ల మేర నగదు వసూలు చేసినట్లు పోలీసుల అంతర్గత విచారణలో తేలింది.
ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ
ఈ వ్యవహారంలో చట్టబద్ధంగా ప్రభుత్వ అనుమతులు రావడం అసాధ్యమని తేలడంతో నిందితులు క్రైమ్ రూట్ ఎంచుకున్నారు. ఒక న్యాయవాది తెరవెనుక ఉండి ఇచ్చిన సలహాలతో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయ పేరుతో నకిలీ ప్రొసీడింగ్స్, నకిలీ ఎన్‌వోసీలు, నకిలీ జీవోలను సృష్టించారు. సదరు విభాగాల ఉన్నతాధికారుల పేర్లు, సంతకాలను అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేసి, అవి అసలైన ప్రభుత్వ ఫైళ్లలాగే భ్రమపడేలా హై-టెక్నాలజీతో డిజైన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నారు
కేసు నమోదు కాగానే పరారైన రాధాకృష్ణకు అతని డ్రైవర్ పూర్తి స్థాయిలో సహకరించాడు. పోలీసుల కదలికలను నిరంతరం గమనిస్తూ నిందితుడిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడమే కాకుండా కీలకమైన ఫోర్జరీ డాక్యుమెంట్లను దాచిపెట్టడంలో సాయపడ్డాడు. అయితే సైబరాబాద్ క్రైమ్ టీమ్ సాంకేతిక ఆధారాలు, డిజిటల్ లొకేషన్ల సాయంతో నిందితుల గూటిని కనిపెట్టి ఇద్దరినీ మడతపెట్టారు.
ఇది కేవలం ఒక భూమి లావాదేవీ కాదని ప్రభుత్వ రికార్డులను ముద్రలను సృష్టించిన వ్యవస్థీకృత కుట్ర అని సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ రూ.12 కోట్ల మనీ ట్రైల్‌కు సంబంధించి పూర్తి బ్యాంక్ అకౌంట్లు, నగదు బదిలీల లంకెలను వెలికితీసేందుకు ప్రత్యేక ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశామని, ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
