
ఏపీకి రెండు ఆడ పులులు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ ముంబయిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలతో పాటు, ముఖ్యంగా వన్యప్రాణుల రక్షణ, తూర్పు కనుమలలో పులుల సంరక్షణపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో పులుల సంఖ్యను పునరుద్ధరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి రెండు ఆడ పులులను ఇచ్చేందుకు అంగీకరించినందుకు గానూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ జంతు మార్పిడి తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. ఏపీలోని తూర్పు కనుమల అడవులలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడం వల్ల అంతరసంతానోత్పత్తి సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే రెండు ఆడ పులుల ద్వారా జన్యు వైవిధ్యం పెరిగి, పులుల ఆరోగ్యకరమైన సంతతి అభివృద్ధి చెందడంతో పాటు వాటి జనాభా దీర్ఘకాలికంగా స్థిరపడేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. దీని ద్వారా తూర్పు కనుమలలో స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పాటుకు కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ద్వారా జీవ వైవిధ్య పరిరక్షణకు ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ఈ సంయుక్త కార్యాచరణ నిరూపిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమకు నిరంతరం మార్గదర్శకత్వం వహించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కి కూడా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వన్యప్రాణుల రక్షణ లక్ష్యాల సాధనలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్రతో కలిసి భవిష్యత్తులో మరిన్ని సంయుక్త కార్యక్రమాలతో ముందుకు సాగుతామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
