
ఎడప్పాడిలో టీవీకే వ్యూహం మార్పు.. స్వతంత్ర అభ్యర్థికి విజయ్ మద్దతు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సేలం జిల్లాలోని అత్యంత కీలకమైన ఎడప్పాడి నియోజకవర్గంలో నటుడు, రాజకీయ నేత విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) తన వ్యూహాన్ని అనూహ్యంగా మార్చుకుంది. పార్టీ అధికారిక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న కే.ప్రేమకుమార్‌కు మద్దతు ఇస్తున్నట్లు విజయ్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమకుమార్ గతంలో విజయ్ అభిమాన సంఘం నిర్వాహకుడిగా పనిచేయడం గమనార్హం.
నామినేషన్ తిరస్కరణతో కొత్త అడుగు
టీవీకే తొలుత ఎడప్పాడి నుంచి అరుణ్ కుమార్‌ను తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. అయితే సాంకేతిక కారణాల రీత్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించింది. ఈ పరిణామంతో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ విజయ్ ఆదివారం సామాజిక మాధ్యమం వేదికగా కీలక ప్రకటన చేశారు. ప్రేమకుమార్‌ను తమ ఆత్మీయ అభ్యర్థిగా అభివర్ణిస్తూ ఆయనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి నేరుగా పోటీలో లేకపోయినా ప్రేమకుమార్‌ను తమ ప్రతినిధిగానే భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రేమకుమార్ ప్రస్తుతం "టెలివిజన్ సెట్" గుర్తుతో ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటర్లు ఆ గుర్తును గుర్తించి ఓటు వేయాలని కోరుతూనే విజయ్ ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమ పార్టీ గుర్తును అడ్డుకునేందుకు కొందరు వక్రీకృత మార్గాలు అనుసరించారని ఆయన పరోక్షంగా ఆరోపించారు. ప్రేమకుమార్ విజయం ద్వారా అలాంటి శక్తులకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.అదేవిదంగా క్షేత్రస్థాయిలో టీవీకే కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు.
మారుతున్న ఎన్నికల సమీకరణాలు
ఎడప్పాడి నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామికి బలమైన కోటగా గుర్తింపు పొందింది. అటువంటి కీలక స్థానంలో టీవీకే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి రంగప్రవేశం చేయడం రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చివేసింది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఓటింగ్ సరళిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో విజయ్ పిలుపు పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
