
టీవీకే మేనిఫెస్టో విడుదల
విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం (టీవీకే) గురువారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, పెళ్లికి 8 గ్రాముల బంగారం, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఆరు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలను ఇందులో ప్రకటించింది.
తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.2,500 సహాయం అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. పేద వధువులకు 8 గ్రాముల బంగారంతో పాటు నాణ్యమైన పట్టు చీర కూడా ఇస్తామని ప్రకటించారు. అలాగే మహిళలు నడిపే స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు.
ప్రభుత్వ, ప్రభుత్వ సహకార పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు చదువు మానేయకుండా ఉండేందుకు వారి తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. విద్యాభివృద్ధికి కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి కే.కామరాజ్ పేరుతో 100 ప్రత్యేక నివాస పాఠశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఉన్నత విద్య కోసం రూ.20 లక్షల వరకు విద్యారుణాలు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా కీలక హామీలు ఇచ్చారు. ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతుల వ్యవసాయ సహకార పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు 50 శాతం రుణమాఫీ కల్పిస్తామని చెప్పారు. ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని, అదే సంఖ్యలో స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.4,000 వరకు భృతి ఇస్తామని చెప్పారు. ఆరోగ్య రంగంలో డ్రగ్‌లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొని “డ్రగ్-ఫ్రీ తమిళనాడు” లక్ష్యంగా పనిచేస్తామని విజయ్ ప్రకటించారు. ఆసుపత్రులను ఆధునీకరించడం, ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం, ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు అందిస్తామని చెప్పారు.
ఇంకా వృద్ధులు, దివ్యాంగులకు నెలకు రూ.3,000 పెన్షన్, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, భూ పట్టాల రెగ్యులరైజేషన్, ప్రతి ఇంటికి పైప్‌లైన్ తాగునీటి సరఫరా వంటి హామీలను మేనిఫెస్టోలో చేర్చారు. ప్రభుత్వ సేవలను నిర్ణీత కాలంలో అందించేలా చట్టబద్ధ హామీ ఇవ్వడం, రేషన్ సరుకులు వంటి సేవలను ఇంటి వద్దకే అందించే విధానం అమలు చేస్తామని తెలిపారు.
