Let's talk: editor@tmv.in
సోషల్ మీడియా ప్రచారంతోనే టీవీకే అధికారం దక్కించుకుంది: ఎం.కె.స్టాలిన్

సోషల్ మీడియా ప్రచారంతోనే టీవీకే అధికారం దక్కించుకుంది: ఎం.కె.స్టాలిన్

Panthagani Anusha
19 మే, 2026

తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ గెలవడంపై డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయలేదని, కేవలం సోషల్ మీడియాను వాడుకుని మాయ చేసి గెలిచిందని ఆరోపించారు. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడిన స్టాలిన్, టీవీకే పార్టీ పేరు నేరుగా చెప్పకుండా డిజిటల్ ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తమ డీఎంకే పార్టీ ఎప్పటిలాగే ఊరూరా తిరుగుతూ ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తూ ఓటర్ల జాబితాల సవరణ లాంటి ఎన్నో పనులు చేసిందని కానీ కొత్తగా వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీకి చాలా చోట్ల కౌంటింగ్ రోజు కూర్చోవడానికి ఏజెంట్లు కూడా లేరని అయినా సరే వారు గెలిచారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం ఫోన్లలో, సోషల్ మీడియాలో రంగురంగుల ప్రచారాలు చూపెట్టి జనాలను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు.

కాగా ఈ డిజిటల్ ప్రచారం ఇళ్లలోని యువతను, చిన్న పిల్లలను బాగా ఆకర్షించిందని వారి ద్వారా ఇంట్లోని పెద్దవాళ్లు కూడా ప్రభావితమై ఆ పార్టీకి ఓటేశారని ఈ విషయాన్ని తాము ముందుగా గమనించలేకపోయామని కానీ ఇప్పుడు అసలు విషయం అర్థమైందని ఇకపై తాము కూడా చాలా అలర్ట్‌గా ఉంటామని సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ప్రచారాలను తిప్పికొట్టేందుకు గట్టి వ్యూహాలు సిద్ధం సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఇక తమ పార్టీ కార్యకర్తలు కూడా ఇకపై డిజిటల్ ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

1949లో పెట్టిన డీఎంకే పార్టీ చరిత్రలో ఎన్నో గెలుపోటములను చూసిందని స్టాలిన్ కేడర్‌లో ధైర్యం నింపారు. ఎన్ని దెబ్బలు తగిలినా తమ పార్టీ "ఫీనిక్స్ పక్షిలా" మళ్లీ మళ్లీ లేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ సిద్ధాంతాలు, ప్రజలతో ఉన్న పాత బంధమే తమకు శ్రీరామరక్ష అని రాబోయే రోజుల్లో సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.