Let's talk: editor@tmv.in
కూటమి ప్రభుత్వంలో పసుపు రైతుకు తీరని అన్యాయం: వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు

కూటమి ప్రభుత్వంలో పసుపు రైతుకు తీరని అన్యాయం: వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు

Panthagani Anusha
10 మే, 2026

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పసుపు రైతులను నిలువునా ముంచుతోందని కనీస మద్దతు ధర కల్పించకుండా చంద్రబాబు నాయుడు రైతాంగాన్ని నాశనం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు తీవ్రంగా విమర్శించారు. శనివారం భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలో పర్యటించిన ఆయన అక్కడ సాగు చేసిన పసుపు పంటను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా కొనుగోలు చేసి రైతులకు కొండంత అండగా నిలిచామని గుర్తుచేశారు. ముఖ్యంగా పసుపు పంటకు క్వింటాలుకు రూ.8,000 నుంచి రూ.9,000 వరకు మద్దతు ధర కల్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు రైతులు లాభసాటి ధరలతో ఆనందంగా ఉండేవారని కానీ నేడు పరిస్థితి పూర్తిగా తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. నేడు మార్కెట్‌లో పసుపు క్వింటాలుకు కనీసం రూ.5,000 కూడా పలకడం లేదని దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. దళారులు, వ్యాపారులతో ప్రభుత్వం కుమ్మక్కై రైతును నట్టేట ముంచుతోందని గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యల బాట పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పసుపు పంటకు క్వింటాలుకు కనీసం రూ.10,000 మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం ఆపదని ప్రభుత్వం తన మొండివైఖరిని వీడకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అశోక్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.