Let's talk: editor@tmv.in
టీటీడీ నెయ్యి వివాదం..సిఫార్సుల అమలుకు హై లెవల్ కమిటీ ఏర్పాటు

టీటీడీ నెయ్యి వివాదం..సిఫార్సుల అమలుకు హై లెవల్ కమిటీ ఏర్పాటు

Panthagani Anusha
8 మే, 2026

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో నెయ్యి కొనుగోలు వ్యవహారంపై ఏర్పడిన వివాదానికి సంబంధించి కీలక ముందడుగు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఏక సభ్య కమిటీ సమర్పించిన నివేదికలోని సిఫార్సులను పరిశీలించి అమలు చేయడానికి ఈ కమిటీని నియమించింది.

టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేపట్టి ఇటీవల చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ పరిణామాల అనంతరం టీడీపీ ప్రభుత్వం ఫిబ్రవరి 20న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌ను ఒక వ్యక్తి కమిటీగా నియమించింది.

కాగా ఈ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. నివేదికలో వ్యవస్థాపరమైన లోపాలు, విధానపరమైన తప్పిదాలు, బాధ్యత అంశాలు అదేవిదంగా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర సిఫార్సులు చేసింది.

అయితే ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం సిఫార్సుల అమలుకు ఒక క్రమబద్ధమైన వ్యవస్థ అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేస్తూ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

కాగా ఈ కమిటీకి ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించగా రాష్ట్ర డీజీపీ సభ్యుడిగా, న్యాయశాఖ కార్యదర్శి సభ్య-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కమిటీ బాధ్యతలలో ఒక వ్యక్తి కమిటీ నివేదికను సమగ్రంగా పరిశీలించడం పరిపాలనా, క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలపై స్పష్టమైన సూచనలు ఇవ్వడం అదేవిదంగా అమలుకు ప్రాధాన్యత క్రమంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.

అదనంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల అమలు సమర్థవంతంగా జరుగుతున్నదీ కాదో పర్యవేక్షించేందుకు తగిన మెకానిజం సూచించాలని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీ వారం రోజుల్లో తన నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు.