
టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.03 కోట్లు విరాళం
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పేద రోగుల ప్రాణాలను కాపాడేందుకు టీటీడీ నడుపుతున్న 'ప్రాణదాన ట్రస్ట్'కు ముంబైకి చెందిన విజయ్ రమేష్ చంద్ర అనే భక్తుడు భారీ ఆర్థిక సాయాన్ని అందించారు. రూ.1.03 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు.
ఈ విరాళానికి సంబంధించిన చెక్కును దాత విజయ్ రమేష్ చంద్ర తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ అదనపు కార్యనిర్వాహణాధికారి (ఏఈఓ) చి.వెంకయ్య చౌదరికి స్వయంగా అందజేశారు. దాత ఉదారతను అభినందించిన అధికారులు ఈ నిధులు నిరుపేద రోగుల చికిత్సకు ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. శ్రీవారి పట్ల ఉన్న అపారమైన భక్తితో పాటు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ విరాళం ఇచ్చినట్లు సమాచారం.
2001లో టీటీడీ చేత స్థాపించబడిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ అత్యవసర వైద్య చికిత్స అవసరమైన పేద రోగులకు ఆశాదీపంగా నిలుస్తోంది. ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు, మెదడు, క్యాన్సర్ వంటి ప్రాణాపాయ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించడం ఈ ట్రస్ట్ ప్రధాన లక్ష్యం. విరాళాల రూపంలో అందే నిధులను పూర్తిస్థాయిలో రోగుల శస్త్రచికిత్సలు, మందుల కోసం టీటీడీ వినియోగిస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా పేరుగాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షక సంస్థగా టీటీడీ వ్యవహరిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ క్షేత్రం, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతలోనూ అగ్రగామిగా ఉంటోంది.
